కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌పై సీఎం వైఖరి తెలపాలి

– రెండో ఏఎన్‌ఎంలను పర్మినెంట్‌ చేయాలి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌
– వివిధ రూపాల్లో రెండో ఏఎన్‌ఎంల నిరసన
నవతెలంగాణ- విలేకరులు
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేస్తామన్న సీఎం కేసీఆర్‌.. రెండో ఏఎన్‌ఎంల విషయంలో తన వైఖరిని స్పష్టం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో ఏఎన్‌ఎంల సమ్మె కొనసాగుతోంది. అందులో భాగంగా.. తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సమ్మె శిబిరాన్ని భూపాల్‌ సందర్శించారు. అంతకుముందు ఏఎన్‌ఎలు ధర్నా చౌక్‌ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్‌ మాట్లాడుతూ.. 2014 ముందు రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్‌.. ఆనాడు కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ విధానం ఆంధ్ర నాయకులు తెచ్చినదని, చంద్రబాబు తెచ్చిన ఈ విధానాలను 18 అడుగుల లోతులో పూడ్చి పెడతానని ప్రగల్బాలు పలికారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు 20 ఏండ్ల సర్వీసు ఉన్న రెండో ఏఎన్‌ఎంలను పర్మినెంట్‌ చేయకుండా మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్షలు రాయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల సమ్మెలో భాగంగా తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నగర అధ్యక్షులు కుమారస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంట్రాక్టు ఏఎన్‌ఎంలు అందరూ సమ్మెలోకి వెళ్లడంతో వైద్యారోగ్య శాఖలో ప్రభుత్వ కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌లో సీఐటీయూ కార్యాలయం నుంచి ప్రదర్శనగా వెళ్లి అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు.
సంగారెడ్డి పట్టణంలో మూడో రోజున చేపట్టిన ఏఎన్‌ఎంల సమ్మెలో మెడికల్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.యాదగిరి మాట్లాడారు. సిద్దిపేటలో జరుగుతున్న రెండో ఏఎన్‌ఏంల సమ్మేకు సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్‌ మద్దతు తెలిపారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ఏఎన్‌ఎంలు ఒంటి కాలుపై నిలబడి నిరసన తెలిపారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట రెండో ఏఎన్‌ఎంలు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు పోరాటం ఆపేది లేదని వారు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ నుంచి కుమురంభీం చౌక్‌ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఏఎన్‌ఎంలు మానవహారంగా ఏర్పడ్డారు.