– జులైలో రూ.1.65 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : ప్రభుత్వాలు పన్నుల రూపంలో దండిగా వసూలు చేస్తున్నాయి. వరుసగా ఐదోసారి రూ.1.60 లక్షల కోట్ల పైనా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూలు కావడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత ఏడాది జులైలో దేశంలో రూ.1.65 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోల్చితే 11 శాతం పెరుగుదల చోటు చేసుకుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. గడిచిన నెల పన్ను వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.29,773 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.37,623 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.85,930 కోట్లు చొప్పున వసూళ్లయ్యాయి. సెస్ పరంగా రూ.11,779 కోట్లు వచ్చాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.18.10 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. గడిచిన నెలలో ఆంధ్రప్రదేశ్లో 5 శాతం వృద్థితో రూ.3,593 కోట్ల జీఎస్టీ వసూళ్లయ్యింది. గతేడాది ఇదే జులైలో రూ.3,409 కోట్లుగా నమోద య్యింది. ఇదే సమయంలో తెలంగాణలో రూ.4,547 కోట్లు వసూలు కాగా.. 2023 జులైలో 7 శాతం వృద్థితో రూ.4,849 కోట్లకు పెరిగింది.