ప్రజా సమస్యలపై పోరాడే శక్తి..కమ్యూనిస్టులకే ఉంది

– పేదలకు భూములు పంచిన చరిత్ర సీపీఐ(ఎం)దే
– పాలేరు సస్యశ్యామలం కోసం మహాపాదయాత్ర చేశా..
– సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని వీరభద్రం
– గ్రామగ్రామాన అపూర్వ స్పందన
నవతెలంగాణ- కూసుమంచి
ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటాలు చేసే శక్తి కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే ఉందని సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం మండలంలోని ముత్యాలగూడెం, కిస్టాపురం, పోచారం, బొడియా తండా, చౌటపల్లి, బండమీద తండా, గైగొల్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా పేద ప్రజల కోసం కార్మిక, కర్షిక వర్గాల కోసం నిరంతరం పోరాటాలు చేసి, ఆ పోరాటాల్లో విజయాలు సాధించిన చరిత్ర కమ్యూనిస్టులకే ఉందని. ముఖ్యంగా సీపీఐ(ఎం)కు ఉందన్నారు. వేల ఎకరాలు భూములు నిరుపేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలకు ఉందని, ఇది ప్రజలు గుర్తించాలన్నారు. పాలేరు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని గోదావరి జలాలను పాలేరు జలాశయంలో కలిస్తే పాలేరు నియోజకవర్గంలో పాటు ఖమ్మం జిల్లా సస్యశ్యామలవుతుందని, ఆనాడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2600 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం గోదావరి జలాలు పాలేరు జలాశయంలో కలిపే ప్రయత్నం చేస్తున్నారంటే ముమ్మాటికి సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పాదయాత్ర ఫలితమేనని అని అన్నారు. గోదావరి జలాలు పాలేరు జలాశయంలో
కలిపితే, పాలేరు నియోజకవర్గంలో పాటు ఖమ్మం జిల్లా సస్యశ్యామలవుతుందని, ఆనాడే దుమ్ముగూడెం మహాపాదయాత్ర నిర్వహించిన సందర్భంగా మన పార్టీ ఆరోజే చెప్పిందని ఈరోజు ప్రభుత్వాలు మారినా, ప్రతిపాదనలు, డిజైన్లు మార్చి పనులు ప్రారంభించినా, అది కమ్యూనిస్టులు చేపట్టిన దుమ్ముగూడెం మహాపాదయాత్ర ఫలితమే అని మరోసారి గుర్తు చేశారు. ఆనాడు దళితవాడల అభివృద్ధికై కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సైకిల్‌ యాత్ర నిర్వహించా అని, ఈ సైకిల్‌ యాత్ర ఫలితంగా దళితవాడల్లో ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టాలు చేసినా, అది దళిత వాడల అభివృద్ధికి నిర్వహించిన సైకిల్‌ యాత్ర ఫలితమేనని అన్నారు. ముత్యాలగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా తెల్దారుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు మడిపల్లి వెంకన్న స్వచ్ఛందంగా విచ్చేసి తమ్మినేని సమక్షంలో సిపిఎంలో చేరారు.
సీపీఐ సీనియర్‌ నాయకులు సంగబత్తుల వెంకటరెడ్డిని కలిసిన తమ్మినేని
మండలంలోని గైగొళ్లపల్లి గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్‌ నాయకులు సంగబత్తుల వెంకట్‌ రెడ్డిని ఎన్నికల ప్రచారంలో భాగంగా సిపిఎం పాలేరు నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని వీరభద్రం కలిశారు. ఈ సందర్భంగా వెంకట్‌ రెడ్డి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిపిఎం నుంచి తాను పోటీ చేస్తున్నానని, తమకు ఓటు వేయాల్సిందిగా వెంకటరెడ్డిని అడిగారు.
తమ్మినేనికి గ్రామ గ్రామాన అపూర్వ స్పందన
తమ్మినేని వీరభద్రం మండలంలోని ఆయా గ్రామాలలో ప్రచారం నిర్వహించగా అపూర్వ స్పందన లభించింది. గ్రామగ్రామాన పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ్మినేని జిందాబాద్‌ సిపిఎం జిందాబాద్‌ అంటూ యువకులు నినాదాలు చేశారు. యడవల్లి రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఎన్నికల ప్రచారంలో పాలేరు డివిజన్‌ ఇంచార్జీ బండి రమేష్‌, మండల ఇంచార్జీ బుగ్గవీటి సరళ, మండల కమిటీ సభ్యులు శీలం గురుమూర్తి, మల్లెల సన్మతరావు, తోటకూర రాజు, బిక్కసాని గంగాధర్‌, తాళ్లూరి వెంకటేశ్వర్లు, కర్ణబాబు, మూడు గన్య నాయక్‌, కిష్టయ్య వెంకటయ్య, వ్యకాస మండల అధ్యక్షుడు చిట్టురి వెంకన్న జీఎంపీఎస్‌ జిల్లా కార్యదర్శి తుశాకుల లింగయ్య పాల్గొన్నారు.
మా ఇంట్లో భోజనం చేయటం జీవితంలో మర్చిపోలేని విషయం..
తమ్మినేని వీరభద్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని కిష్టాపురం గ్రామానికి చేరుకున్నారు. తమ్మినేని వీరభద్రం వస్తున్నారని విషయం తెలుసుకున్న ఇర్రి ప్రకాశం-సుగుణమ్మ దంపతులు తమ్మినేని ప్రచార రధానికి ఎదురెళ్ళి ఆహ్వానం పలికారు. మీలాంటి నాయకులు ఆరోజు మా ఇంట్లో భోజనం చేసిన విషయాన్ని మర్చిపోలేదని మళ్ళీ మీరు ఇలా ప్రచారంలో మళ్లీ మా ఊర్లో కలవడం చాలా ఆనందంగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ”తమ్మినేని వీరభద్రం ఆనాడు దళితవాడల అభివృద్ధికై నిర్వహించిన సైకిల్‌ యాత్రలో భాగంగా కృష్టపురం గ్రామానికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి మా ఇంట్లోనే భోజనం చేసి అక్కడే పడుకున్నారని, ఇలాంటి నాయకులు మన నియోజకవర్గంలో సిపిఎం తరఫున పోటీ చేయటం మనందరి అదృష్టమని, ఇలాంటి నాయకున్ని మనం గెలిపించుకోవాలి” అని వారు గర్వంగా చెప్పారు.