పోషకాహార లోపం అధిగమించడం తోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం

నవతెలంగాణ – అశ్వారావుపేట
కొండ రెడ్లులో ఉన్న పోషకాహార లోపాన్ని గుర్తించి దాని నివారణ కోసం అధ్యయనం చేసేందుకు శుక్రవారం బృందం పర్యటించింది.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు పోషకాహార లోపాన్ని అధిగమిస్తే నే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కో – ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.ఎల్ కాంతారావు అన్నారు.  రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర్య రాజన్ ఆదేశాల మేరకు ఆమె దత్తత గ్రామమైన అశ్వారావుపేట మండలం గోగుల పూడి లో శుక్రవారం మాట్లాడుతూ..  మిగతా జనాభాతో పోల్చితే కొండ రెడ్డి గిరిజనుల్లో పోషకాహార లోపం అధికంగా ఉందని,దీనిని అదిగమించేందుకే రాష్ట్రంలోని నాగర్ కర్నూల్,భద్రాద్రి కొత్తగూడెం,ఆదిలాబాద్ జిల్లాల్లోని ఆరు కొండ రెడ్ల గ్రామాలను ఎంపిక చేసి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు వివరించారు.గిరిజనులు సహజంగా అటవీ ప్రాంతాల్లో లభించే అటవీ ఫలాలు తింటారని,వీటిలో అధిక పోషకాలు ఉంటాయన్నారు. అలాగే అటవీ ప్రాంతంలో లభించే ఇప్ప పువ్వులో అనేక రకాల పోషకాలు ఉంటాయని, అందుకే ఇప్ప పువ్వులతో ప్రత్యేకంగా లడ్డూలను తయారీ చేయించి అందిస్తామన్నారు.ఇప్ప పువ్వులో ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్,విటమిన్లు అధికంగా ఉంటాయని,దీని ద్వారా పోషకాహార లోపాన్ని అధిగమించే అవకాశాలు ఉంటాయన్నారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంగాల భూ లక్ష్మీ,రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు జీ రాజారెడ్డి, సూర్యనారాయణ,డాక్టర్ భాను ప్రసాద్, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి కే.రవి కుమార్, గుమ్మడవల్లి ప.హెచ్.సి వైద్యురాలు టీ. మధుళిక,హెచ్.వి దుర్గమ్మ, గ్రామస్తులు జీ.మంగి రెడ్డి, బాబు రెడ్డి పాల్గొన్నారు.