కంప్యూటర్‌ సైన్స్‌కే భారీ డిమాండ్‌

– సీఎస్‌ఈ, అనుబంధ కోర్సుల్లో 94.40 సీట్లు భర్తీ
– 32 కాలేజీల్లో నిండిన వంద శాతం
– రెండోవిడత కౌన్సెలింగ్‌లో 7,417సీట్లు కేటాయింపు
– ఇంజినీరింగ్‌లో మిగిలిన సీట్లు 12,013
– రేపటి వరకే సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు గడువు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న రెండోవిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో సోమవారం సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా 7,417 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించామని తెలిపారు. 25,148 మంది అభ్యర్థులు వారి సీట్లను మార్చుకున్నారని పేర్కొన్నారు. 174 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 82,702 సీట్లుంటే, 70,689 (85.47 శాతం) మందికి సీట్లు కేటాయించామని వివరించారు. ఇంజినీరింగ్‌లో ఇంకా 12,013 (14.53 శాతం) సీట్లు మిగిలిపోయాయని తెలిపారు. నాలుగు యూనివర్సిటీలు, 28 ప్రయివేటు కాలేజీల్లో మొత్తం 32 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. సరిపోయినన్ని వెబ్‌ఆప్షన్లు నమోదు చేయకపోవడం వల్ల 4,701 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించలేదని వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద 5,610 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు బుధవారంనాటికి ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు గడువుందని సూచించారు. ఈనెల నాలుగో తేదీ నుంచి ఇంజినీరింగ్‌ ప్రవేశాల తుది విడత కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) అనుబంధ కోర్సులకే భారీగా డిమాండ్‌ ఉన్నది. ఆయా కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. సీఎస్‌ఈ, ఐటీ అనుబంధ కోర్సుల్లో 56,059 సీట్లుంటే 52,922 (94.40 శాతం) సీట్లు భర్తీ అయ్యాయని వివరించారు. కేవలం 3,137 (5.6 శాతం) సీట్లు మాత్రమే మిగిలిపోయాయని తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ అనుబంధ కోర్సుల్లో 17,320 సీట్లకుగాను 13,515 (78.03 శాతం) సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఇంకా 3,805 (21.97 శాతం) సీట్లు మిగిలిపోయాయని వివరించారు. సివిల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అనుబంధ కోర్సుల్లో 8,125 సీట్లుంటే, 3,533 (43.48 శాతం) సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. ఇంకా 4,592 (56.52 శాతం) మిగిలిపోయాయని పేర్కొన్నారు. ఇతర ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 1,198 సీట్లకుగాను 719 (60.02 శాతం) సీట్లు కేటాయించామని వివరించారు. ఇంకా 479 (39.98 శాతం) సీట్లు మిగిలిపోయాయని తెలిపారు. ఇతర వివరాలకు https://tseamcet.nic.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.