ఏకాగ్రత ముఖ్యం

విద్యార్థులకే కాదు, ఉద్యోగినులు, గృహిణులకూ ఏకాగ్రత ముఖ్యమంటున్నారు నిపుణులు. చేసే పనిని మధ్యలోనే ఆపేయడం లేదా పూర్తిచేసిన పనిలోనూ నాణ్యత లోపించడానికి కారణం ఏకాగ్రత కొరవడటమే అని చెబుతున్నారు. దీన్ని పునరుద్ధరించుకోవడమెలాగో సూచిస్తున్నారు.
– ఉద్యోగినులు కెరియర్‌తోపాటు ఇంటిబాధ్యతలు, పిల్లల సంరక్షణను నిర్వర్తించాల్సి ఉంది. శారీరక అలసటతోపాటు బాధ్యతలతో తీవ్ర ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటారు. దీనివల్ల మానసికంగా అలసి పోయి ఏకాగ్రతకు దూరమవుతారు. ఒక పనిచేస్తూ దాన్ని పూర్తి చేయకుండానే మరో పనిలో నిమగమవడంతో ఏదీ సంపూర్ణంగా చేయలేకపోతుంటారు. ఆఫీస్‌ పని పూర్తిచేయడంలో ఆసక్తి తగ్గుతుంటుంది. ఇటువంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే రోజూ ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. అప్పుడే శరీరానికి, మెదడుకూ ఒకేసారి పూర్తి విశ్రాంతి దొరుకుతుంది. రెండూ.. తిరిగి ఉత్తేజితమవుతాయి. పనిలో ఏకాగ్రత పెరిగి నైపుణ్యాలను ప్రదర్శించగలరు.
– సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగా ఉండండి. ధ్యాసంతా ఫోన్‌పైనే ఉంటే పనిపై ఆసక్తి తగ్గుతుంది. ఆఫీస్‌ లేదా ఇంట్లో వీలైనంత ఫోన్‌ వాడకాన్ని తగ్గించాలి. ఫోన్‌ ఫ్రీ అంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఏకాగ్రతను మళ్లిస్తున్న సోషల్‌మీడియా వినియోగాన్ని వీలైనంత తగ్గించుకుంటే చాలు.
– శరీరంలోని అవయవాలన్నింటికీ ఇచ్చినట్లే మెదడుకూ వ్యాయామాన్నివ్వాలి. మెదడు చురుకుగా ఉంటేనే ఏకాగ్రత పెరుగుతుంది. పజిల్స్‌, సుడోకు, రిడిల్స్‌ పూర్తిచేయండి. ఇంట్లోవాళ్లు లేదా పిల్లలతో కలిసి చేస్తే మనసంతా ఉత్సాహంతో నిండుతుంది. వాళ్లందరితో కలిసి సరదాగా గడిపినట్లుగానూ ఉంటుంది. ఏకాగ్రతా పెరుగుతుంది.
– ఉదయం లేదా సాయంత్రం అరగంటసేపు చేసే వ్యాయామంతో మెదడుకు రక్తప్రసరణ జరుగుతుంది. డోపమైన్‌ హార్మోన్‌ విడుదలై మనసు ఉత్తేజితం అవుతుంది. ఇది పనిపై ఏకాగ్రతను పెంచుతుంది. వ్యాయామంలో భాగంగానే మెడిటేషన్‌కూ స్థానమివ్వాలి. దారిమళ్లించే రకరకాల వ్యాపకాల నుంచి మనసును ధ్యానం దూరంగా ఉంచుతుంది. మానసిక ఆందోళన, ఒత్తిడిని తరిమేసి, ఏకాగ్రతను అందిస్తుంది.