హాకింపేట స్పోర్ట్స్‌ స్కూల్లో విద్యార్థుల ఆందోళన

– ఓఎస్డీ హరికృష్ణను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌
నవ తెలంగాణ-శామీర్‌ పేట
మేడ్చల్‌ -మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో శనివారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ఓఎస్డీ హరికృష్ణను వారం రోజుల కిందట ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఓఎస్డీ హరికృష్ణ ఎటువంటి తప్పు చేయలేదని.. ఆయనకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విద్యార్థులు స్కూల్‌ మెయిన్‌ బిల్డింగ్‌ నుంచి మెయిన్‌ గేటు వరకు ‘మా సారు మాకు కావాలి’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చి బైటాయించారు. దాంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో స్కూల్‌లోని విద్యార్థులు ఒక్కసారిగా మెయిన్‌ బిల్డింగ్‌ నుంచి పరుగులు తీస్తూ రాజీవ్‌ రహదారిని ఆనుకుని ఉన్న ముఖ్య ద్వారం వరకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్‌ వద్దకు చేరుకున్న విద్యార్థులకు నచ్చజెప్పేందుకు యత్నించారు.
అయినా వీ వాంట్‌ జస్టిస్‌, మా సార్‌ మాకు కావాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. శామీర్‌పేట పోలీసులు విద్యార్థులను అడ్డుకుని గేట్‌లోపలికి పంపించారు. అనంతరం విద్యార్థులు నిరసన కొనసాగించారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకూర్చున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లైంగిక వేధింపులకు పాల్పడిన అసలు నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.