తులసి చందుపై మతోన్మాదుల బెదిరింపులను ఖండించండి

సీఐటీయూ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు ఆర్‌.మహిపాల్‌
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
స్వతంత్ర జర్నలిస్ట్‌, సామాజిక విశ్లేషకురాలు తులసి చందుకు ఫోన్లు చేసి చంపుతామని బెదిరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాదుల చర్యలను అందరూ ఖండించాలని సీఐటీయూ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు ఆర్‌. మమిపాల్‌ అ న్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తులసి చందు స్వతంత్ర జర్నలి స్టుగా మతోన్మాదం, మనువాద ఆగడాలు అరాచకాలను ప్రశ్నిస్తుందన్నారు. దేశంలో శాంతి మతసామరస్యాలను పెంపొందించాలనే దృఢ సంకల్పంతో అనేక సామాజిక మాధ్యమాలలో విశ్లేషణలు చేస్తున్న తులసి చంద్‌పై బెదిరింపులకు పాల్పడటం అప్రజాస్వామికం అన్నారు. ఆమెను చంపుతామని బెదిరింపులకు పాల్పడడం ఆటవిక చర్యగా అభివర్ణించారు. గతంలో బీజేపీ – మతోన్మాదుల ఆగడాలను ప్రశ్నించినందుకు గౌరీ లంకేష్‌, కల్బుర్గి, ఫన్సారే, ధబోల్కర్‌లను హతమార్చిన ఈ మతోన్మాద గుండాలు ఇప్పుడు తులసి చందును హత్య చేస్తామంటూ బెదిరిస్తూ అరాచకానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తులసి చందుకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆమెకి ఏ ప్రాణ హాని జరిగినా రాష్ట్రంలోని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతలు బాధ్యత వహించాల్సి ఉంటుందనీ హెచ్చరించారు. ఆమెకు రక్షణ కల్పించాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర, జిల్లా కమిటీ ఆమెకు మద్దతుగా ఉంటుందన్నారు. బెదిరింపులకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.