– కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు బీజేపీ నేతల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో స్థిరాస్తులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయనీ, గాడితప్పుతున్న ఆర్థిక పరిస్థితిపై కేంద్రం సమీక్ష నిర్వహించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కి బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మనోహర్‌రెడ్డి విన్నవించారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో వారు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణలో భాగంగా మద్యం, భూముల అమ్మకాలపై ఆధారపడటం వంటి విషయాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సంస్థలకు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులను పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ల వాయిదా చెల్లింపులు కోసం వాడుతున్నారని చెప్పారు. ఆవాస్ యోజన, సడక్ యోజన, స్మార్ట్ సిటీ పనులు నిధులు కూడా అలాగే జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజత కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయకపోవడంతో విద్యా, వైద్యం, ఉపాధి, రంగాలు కుంటుపడ్డాయని వివరించారు. రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాల విషయాన్ని లబ్దిదారులకు తెలిసేలా రసీదులు ఇస్తున్నట్టుగానే ప్రతిపనిలోనూ అది జరిగేలా చూడాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం పెంచుకుంటూ పోతే రాష్ట్రం చివరకు దివాళా తీసే పరిస్థితి వస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. ఖజానా ఖాళీ అవ్వడంతో మద్యం అమ్మకాలకు సంబంధించి ముందుగానే టెండర్లకు పిలిచి డబ్బులను వసూలు చేసే పనిలో రాష్ట్ర సర్కారు ఉందని వివరించారు.