అయోమయానికి గురవుతున్న పార్టీ శ్రేణులు…

– అదిష్టానం అప్రమత్తం కాకపోతే  నష్టం తప్పదు…
– విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం
నవతెలంగాణ – అశ్వారావుపేట
మాజీ ఎంపీ,కాంగ్రెస్ ప్రచార కమిటీ కో – చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏకపక్ష వ్యవహార తీరు పార్టీ ఓటమికి కారణం కాబోతుందని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన మోసాన్ని గుర్తించి భద్రాచలం ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్ లో చేరారని,పొంగులేటి ఒంటెద్దు పోకడలకు ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలని ప్రశ్నించారు.ఈ మేరకు శుక్రవారం సుంకవల్లి వీరభద్రరావు గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నేను కాంగ్రెస్ లో చేరే నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని,తర్వాత పొంగులేటి కాంగ్రెస్ లో చేరిన తర్వాత పరిస్థితులు “చే” జారి పోతున్నట్లు కనిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ టిక్కెట్ ఆశించటం లో తప్పులేదని,కానీ జారే ఆదినారాయణ పార్టీ టిక్కెట్ తనదేనని, ‘తాటి’ కి టిక్కెట్ రాదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.అసలు తనకు టిక్కెట్ రాదని చెప్పటానికి ‘జారే’ ఎవరంటూ నిలదీశారు. ఏ పార్టీలో నైనా సీనియర్ల, జూనియర్ల ను సమన్వయం చేసుకుని పని చేయాలన్నది ప్రధాన నిబంధన గా ఉంటుందని,పొంగులేటి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత పార్టీ శ్రేణుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని, ఏ నాయకుడి తో కలిసి పని చేయాలో అర్ధం కాని దుస్థితిలో సీనియర్ నాయకులు సైతం ఆందోళన చెందుతున్నట్లు వివరించారు.గత కొంతకాలంగా పార్టీ శ్రేణులను కలుపుకుని పని చేస్తారని వేచి చూశామని, కానీ పొంగులేటి ఆయన అనుచరులు కనీసం స్పందించక పోగా వర్గాలను పెంచి పోషిస్తూ విభజన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహించారు.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఓటమి ప్రమాదం ఉందని జోస్యం చెప్పారు. అసలు కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి గెలిపించేందుకు వచ్చారా? లేదా ఓడించటానికి వచ్చారా?అనే అనుమానాలు నాయకులు, కార్యకర్తల్లో ఉందని అన్నారు.స్వార్ధ రాజకీయాలు చేసే వ్యక్తుల నే పొంగులేటి నెత్తిన పెట్టుకుని ప్రోత్సాహిస్తున్నారని, అటువంటి వారి వల్ల తీరని నష్టం ఉంటుందని గ్రహించాల్సిందిగా సూచించారు.ఇప్పటికైనా పార్టీ అదిష్టానం మేల్కోకుంటే రానున్న ఎన్నికల్లో నష్టం తప్పదని హితవు పలికారు. నిజమైన నాయకుడు,కష్టపడి పని చేస్తే కార్యకర్తలను కలుపుకుని సమిష్టిగా పోరాడితేనే విజయం అందుకోగలమని,తాను స్వయంగా పొంగులేటి ని కలిసి పరిస్థితులను వివరించానని, ఇకపై అటువంటి పరిస్థితులు ఉండవని హమీ ఇచ్చినా మార్పు కనిపించటం లేదని ఆవేదన వెలిబుచ్చారు. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను పార్టీ దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు సుంకవల్లి వీరభద్రరావు,జ్యేష్ట సత్యనారాయణ చౌదరి,బత్తిన పార్ధ సారధి,మాజీ సర్పంచ్ పొట్ట రాజులు తదితరులు పాల్గొన్నారు.