టీఎస్‌పీఎస్‌సీ పేపర్లు అమ్ముకున్నందుకు సంబరాలా?

– డాక్టర్‌ ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
టీఎస్‌పీఎస్‌సీ పేపర్లు లీక్‌ చేసి, రూ.కోట్లకు ఉద్యోగాలను అమ్ముకున్నందుకు నిరుద్యోగులు తెలంగాణ సంబరాలను జరుపుకోవాలా? అని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 30 లక్షల నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్‌, సభ్యులతో రాజీనామాను ఎందుకు చేయించటం లేదని ప్రశ్నించారు. పేపర్ల లీకేజీలో పాత్రధారులను అరెస్టు చేసిన ప్రభుత్వం సూత్రధారులను ఎందుకు అరెస్టు చేయటంలేదని విమర్శించారు. వారందరూ సీఎంవోలోనే ఉన్నారని ఆరోపించారు.