వరదలపై కాంగ్రెస్‌, బీజేపీ బురద రాజకీయాలు

– తక్షణ సహాయం కింద రూ.500 కోట్లు విడుదల
–  అధికారుల సేవలు మరువలేనివి..
– విద్యుత్‌ అధికారులకు సెల్యూట్‌
–  సహాయక చర్యల్లో కేంద్ర ప్రభుత్వానిది కక్షపూరిత వైఖరి
– శాసనసభలో లఘుచర్చలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి
– సరైన వివరణ ఇవ్వలేదంటూ కాంగ్రెస్‌ వాకౌట్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వరద బాధితులకు తక్షణ సహాయంగా కింద రూ.500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి శాసనసభలో చెప్పారు. చరిత్రలో ఎన్నడూ చూడని రికార్డు స్థాయి వర్షాలు కురిశాయనీ, సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసి నష్టాన్ని నిలువరించారని అన్నారు. ‘ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన నష్టం-ప్రభుత్వం చేపట్టిన చర్యలు’ అనే అంశంపై శుక్రవారం అసెంబ్లీలో లఘుచర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సరైన జవాబు ఇవ్వలేదనే కారణంతో సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు కాంగ్రెస్‌ ఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆ పార్టీ సభ్యులంతా సభ నుంచి వెళ్లిపోయారు. ఎమ్మేల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, శ్రీధర్‌ బాబు, అక్బరుద్దీన్‌ ఓవైసీ, సండ్ర వెంకటవీరయ్య, రఘునందన్‌రావు, సీతక్క, బాల్కసుమన్‌, రెడ్యానాయక్‌, రేఖానాయక్‌, ఈటల రాజేందర్‌, రమేశ్‌బాబు, తదితరులు లేవనెత్తిన అంశాలపై ప్రశాంత్‌రెడ్డి సభలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. వర్షాల సమయంలో అధికారులు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. వరదల్లో ప్రాణాలు తెగించి కరెంటును పునరుద్ధరించిన విద్యుత్‌ సిబ్బందికి సెల్యూట్‌ చేశారు. కానీ, కాంగ్రెస్‌,బీజేపీ సభ్యులు వరదపై బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలు అనేటోళ్లు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామంటున్నోళ్లు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం విచారకరమన్నారు. జూలై 17 నాటికి రాష్ట్ర వార్షిక సగటు వర్షపాతం కంటే 20 శాతం లోటుండగా.. 28 జూలై నాటికి 66 శాతం అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. 10 జిల్లాల్లో ఏడాది పాటు కురిసే సగటు వర్షపాతంలో సగం కేవలం 8 రోజుల్లోనే నమోదైన తీరును వివరించారు. 20 సెంటీమీటర్ల వర్షం దాటితేనే క్లౌడ్‌ బ్లాస్ట్‌ అంటారనీ, అలాంటిది లక్ష్మీదేవిపేటలో 6 గంటల్లో 65 సెంటీమీటర్లు, వాజేడులో 52 సెంటీమీటర్లు, వేల్పూర్‌లో 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇంతటి వర్షాలను ఎవ్వరూ ఊహించలేదనీ, అయినా, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండి క్షేత్ర స్థాయిలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారన్నారు. మోరంచపల్లి వరదల్లోంచి 1500 మందిని రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారని తెలిపారు. వరదలకు ప్రభావితమైన 139 గ్రామాల్లో 7,870 ఇండ్ల నుంచి 27,063 మందిని 157 పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించామని వివరించారు. ఆయా జిల్లాలకు ఏడుగురు స్పెషలాఫీసర్లను నియమించామన్నారు. వరదల అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులను పకడ్బందీగా చేశామన్నారు.
సహాయంలో కేంద్ర ప్రభుత్వ కక్ష్య పూరిత వైఖరి
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రజలను ఒకలా, ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రజలను మరోలా చూస్తున్నదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ‘2016లో తెలంగాణలో కురిసిన వర్షాలకు రూ.3,851 కోట్ల నష్టం వాటిల్లినట్టు కేంద్ర బృందం అంచనా వేసింది. 2020లో సుమారు రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. ఈ రెండేండ్లలో కలిపి రూ.8,851 కోట్ల నష్టం జరిగింది. అయినా, కేంద్రం నయా పైసా ఇవ్వలేదు. 2018-22 మధ్యలో ఇతర రాష్ట్రాలకు విపత్తు సాయం కింద కేంద్ర ప్రభుత్వం 44,219 కోట్లు విడుదల చేసింది’ అని విమర్శించారు. సీఎం స్వయంగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. ‘2020 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.1,350 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ స్వయంగా లేఖ రాశారు. ఈసారి కూడా కేంద్రం నుంచి కనీస స్పందన రాలేదు. సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి కేంద్ర హౌంమంత్రి అమిత్‌షాను కలిసి వరద సాయం చేయాలని కోరారు. వరద సాయం కోసం ప్రధానికి లేఖ రాశారు. అయినా స్పందించలేదు. ‘ అదే సమయంలో కర్ణాటక అప్పటి సీఎం లేఖ రాస్తే వెంటనే స్పందించి రూ.669 కోట్లు విడుదల చేశారు. గుజరాత్‌లో వరదలు వస్తే ప్రధాని వెళ్లి రూ.500 కోట్లు మంజూరు చేశారు.. 2020లో వచ్చిన వరదలకుగానూ కేంద్రం 16 రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసింది. అందులో తెలంగాణ పేరేలేదు. పొరుగు రాష్ట్రం ఏపీకి రూ.351.43 కోట్లు, గుజరాత్‌కు రూ.1,000 కోట్లు, కర్ణాటకకు రూ.994.27 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.600 కోట్లు, ఒడిశాకు రూ. 500 కోట్లు, బీహార్‌కు రూ.1,038 కోట్లు, మహారాష్ట్రకు రూ.355.39 కోట్లు, తమిళనాడుకు రూ.352.85 కోట్లు విడుదల చేసింది’ అని వివరించారు. వరద బాధిత కుటుంబాలకు కేంద్రం నిబంధనల ప్రకారం రూ.1800 మాత్రమే ఇవ్వాలని ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సొంతంగా రూ.10 వేల చొప్పున ఇస్తున్నదని తెలిపారు. 2020లో హైదరాబాద్‌లో భారీ వరదలు వచ్చినప్పుడు కేంద్రం స్పందించకపోవడంతో సీఎం తక్షణం రూ.650 కోట్లు విడుదల చేసి నష్టపోయినవారికి 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారని గుర్తుచేశారు. గతేడాది అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు 10వేల చొప్పున 4.50 లక్షల ఎకరాలకు గను 455 కోట్లు ప్రకటించారన్నారు. ఇప్పటికే రైతులకు 150 కోట్లు పరిహారం అందించామనీ, మిగతాదీ ప్రాసెస్‌లో ఉందని తెలిపారు.