– గెలిచే సీటును పణంగా పెట్టారు
– సీపీఐకి కేటాయించడం దురదృష్టకరం
– బీసీ నాయకుడిగా సర్వేలన్నీ నాకే అనుకూలం
– ఐదేండ్లుగా పనిచేస్తున్న నా సంగతి ఏంటి
– ఇప్పటికైనా అధిష్టానం నాకు బీఫామ్ ఇవ్వాలి
– టీపీసీసీ జనరల్ సెక్రెటరీ కృష్ణ ఆవేదన
నవతెలంగాణ-పాల్వంచ
ఎప్పుడు పోలింగ్ జరుగుతుందా, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఎదురుచూస్తున్న కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఏకపక్షంగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు మనోభావాలకు వ్యతిరేకంగా, కనీసం నాకు సమాచారం ఇవ్వకుండా కొత్తగూడెం సీటు సీపీఐకి కాంగ్రెస్ అధిష్టానం కేటాయించడం దురదృష్టకరమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ, కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ సీటును ఆశిస్తున్న ఎడవల్లి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పాల్వంచలోని తన నివాసంలో కలవడానికి వచ్చిన కార్యకర్తలను ఓదార్చుతూ అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఎడవల్లి కృష్ణకు సింపతి ఉందని గెలుస్తాడని సర్వేలను కూడా గమనంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం తీరని చెరగాతంగా మారిందన్నారు. నేను కూడా జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తల సహకారం వల్ల 50 వేల సభ్యత్వం చేసి రూ.10లక్షలు పార్టీకి అందజేసి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లోకి వెళ్లామని చెప్పారు. కచ్చితంగా కాంగ్రెస్ గెలిచే సీటును అన్యాయంగా సీపీఐకి కేటాయించడం తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రజల మనోభావాలకు అనుగుణంగా చెప్తున్న అధిష్టానం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. నేను బుధవారం నామినేషన్ వేయబోతున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నానని బీఫారం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పొత్తులు విరమించుకొని వాళ్లకు ఎమ్మెల్సీ, ఓ రాజ్యసభను ఇచ్చి ఇక్కడ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీకి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న గాక మొన్న వచ్చిన వాళ్లకు కండువాలు కప్పి టికెట్ ఇస్తున్నారన్నారు. మరి ఐదు సంవత్సరాలుగా పనిచేసిన నా సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. బీసీ నాయకుడుగా ఉన్న గుర్తించరా పీసీసీ నుంచి సమాచారం కూడా ఇవ్వలేదని ఇది చాలా బాధాకరమని అన్నారు. బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇదే సీపీఐ నాయకులు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. బీఆర్‌ఎస్‌కు వేస్తారని ఆయన చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు రంగారావు, గద్దల రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు