భారతీయ రైతులకు విదేశీ మార్కెట్లతో అనుసంధానం

– వాల్‌మార్ట్‌ సరికొత్త వ్యూహం
– వారి రిటైల్‌ సామ్రాజ్య విస్తరణకే :రైతు సంఘ నేతలు
        గ్లోబల్‌ రిటైలింగ్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ ఎనిమిది లక్షల మంది భారతీయ రైతులను నేరుగా విదేశీ మార్కెట్లకు అనుసంధానం చేస్తానంటూ ఓ సరికొత్త పథకాన్ని రంగం మీదికి తెచ్చింది. తొమ్మిది రాష్ట్రాలు, 500కి పైగా రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌పిఓ) నెట్‌వర్క్‌ను సష్టించి, వారికి విదేశీ మార్కెట్‌లో వ్యాపారం చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెబుతోంది. ఇది వాల్‌మార్ట్‌ వ్యాపారాభివృద్ధి కోసమేననీ, ఇటువంటి వాటివల్ల ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థ, ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న రైతు సహకార సంఘాలు, దెబ్బ తింటాయని రైతు నేతలు భయ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ :30 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్నోసర్వ్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఆరేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని అరకులోయలో కాఫీ రైతులతో తన అనుబంధాన్ని ప్రారంభించింది. వారిలో కొంతమందితో ఎఫ్‌పిఓ ఏర్పాటు చేసి నిర్వహణకు సహాయపడింది. అటువంటి ఎనిమిది ఎఫ్‌పిఒలు టెక్నోసర్వ్‌ ద్వారా పని చేస్తున్నాయని వాల్‌మార్ట్‌ సంస్థ పేర్కొంది. అదేవిధంగా రాష్ట్రంలో జీడి రైతుల మధ్య పనిచేసే మరొక సంస్థ డిజిటల్‌ గ్రీన్‌, సమిష్టి విధానం వల్ల జీడిపప్పు ధరలు 13 శాతం పెరిగాయని ఆ సంస్థ ప్రతినిధి జూలీ గెహ్క్రి చెప్పారు. ప్రొఫెషనల్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ యాక్షన్‌, ఎఫ్‌పిఒలను ప్రోత్సహించడానికి మహిళా రైతుల మధ్య పని చేస్తోందని తెలిపారు. ఈ మూడింటి పరిధిలోని ఎఫ్‌పిఒలతో వాల్‌మార్ట్‌ ఫౌండేషన్‌ ద్వారా నిధులు సమకూరుస్తుంది. ఇప్పుడు వాటిని సమన్వయం చేసి నేరుగా రిటైల్‌ మార్కెట్‌తో అనుసంధానించే నెట్‌వర్క్‌ను వాల్‌మార్ట్‌ రూపొందించింది. తద్వారా తన రిటైల్‌ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వంటి తొమ్మిది రాష్ట్రాలలో ఎనిమిది లక్షల మంది రైతులతో కనీసం 500 ఎఫ్‌పిఓలు పాల్గొంటున్నాయి. కాఫీ, జీడి, పుదీనా, మామిడి, కూరగాయలు, గోధుమలు, చిరు ధాన్యాలను పండించే చిన్న, సన్నకారు రైతులతో కలిసి పనిచేస్తున్నాయి. వాల్‌మార్ట్‌ ప్రతినిధి జూలీ గెహ్క్రి మాట్లాడుతూ.. వాల్‌మార్ట్‌ లేదా ఫ్లిప్‌కార్ట్‌.. సంస్థల కోసం కాదనీ, రైతులు వృద్ధి చెందడానికి సహాయం చేస్తున్నామని, ఎఫ్‌పిఒలను బలోపేతం చేయడానికేనని చెబుతున్నారు.
భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఏక్తా ఉగ్రహన్‌) కో-ఆర్డినేటర్‌ పావెల్‌ కుస్సా మాట్లాడుతూ.. వాల్‌మార్ట్‌ వీటిని నడిపేది లాభాల కోసమేనన్నారు. వాల్‌మార్ట్‌ నియంత్రణలో ఉన్న ఎఫ్‌పిఒలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై ఆఫీస్‌ బేరర్లచే నిర్వహించబడే సహకార సంఘాలను బలహీనపరుస్తాయని కూడా ఆయన సందేహపడ్డారు. ‘వాల్‌మార్ట్‌ భారతదేశంలో వ్యవసాయ మార్కెట్‌లోకి ప్రవేశించాలని కోరుకుంటోంది. లాభమే వీరి ఉద్దేశం కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలి. మేము వారి నుండి రైతులకు ఏదైనా మంచిని ఆశించం. వారు తమ ఉత్పత్తులను విక్రయించడానికి, భారతదేశంలో మార్కెట్‌ను సమగ్రపరచడానికి కొత్త ఛానెల్‌ను తవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చునని కుస్సా అన్నారు. ఎఫ్‌పిఒలను ప్రోత్సహించడం ఇప్పుడేదో వాల్‌మార్ట్‌ కొత్తగా కాదు. 2020లోనే కేంద్రం పది వేలు కొత్త ఎఫ్‌పిఒలను ప్రారంభించింది. వాల్‌మార్ట్‌ కూడా గతంలో సెంట్రల్‌ అమెరికా మరియు మెక్సికోలో ఎఫ్‌పిఒలతో ప్రయోగాలు చేసింది.
లాభాపేక్ష లేని సంస్థలు జోక్యాలు నిజంగా సహాయపడతాయని భావిస్తాయి. వాల్‌మార్ట్‌ సహాయంతో అరకులోయలోని కాఫీ రైతుల మధ్య ఎఫ్‌పిఓలలో కప్పింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని, తద్వారా ప్రతి బ్యాచ్‌ కాఫీ కప్పు నాణ్యతను గుర్తించగలుగుతామని టెక్నోసర్వ్‌ కంట్రీ హెడ్‌ పునీత్‌ గుప్తా చెప్పారు. ”ఈ జోక్యాల ద్వారా, మేము బ్లూ టోకై, స్టార్‌బక్స్‌ వంటి పెద్ద సంస్థాగత కొనుగోలుదారుల సమూహాన్ని తీసుకువచ్చాం. కాబట్టి, వారు వచ్చి ఈ రైతు ఉత్పత్తిదారుల కంపెనీల నుండి ఈ కాఫీని కొనుగోలు చేస్తారు, అరకులోని 5 శాతం కాఫీ రైతులతో ఈ సంస్థ పనిచేస్తుందని గుప్తా పేర్కొన్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో వారి అనుభవాలతో జ్ఞానాన్ని పంచుకోవడం ప్రయోజనకరమని డిజిటల్‌ గ్రీన్‌ కంట్రీ డైరెక్టర్‌ కృష్ణన్‌ పల్లసన చెప్పారు.