కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవినీతిమయం..ప్రజాధనం వృథా…

– కల్వకుంట్ల కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం
– కాంట్రాక్టర్లకు డబ్బులు దోచుకోవటానికి, కల్వకుంట్ల ఫ్యామిలీ తినటానికి కాళేశ్వరం
– కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మాణం చేసిన ప్రాజెక్టులు చెక్కుచెదరలేదు
– విలేకరుల సమావేశంలో మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-ముదిగొండ
లక్ష కోట్ల నిధులతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి సాగుకు చుక్క నీరు అందకుండా అవినీతిమయం చేసి ప్రజాధనాన్ని వృధా చేసిందని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలపరిధిలో ధనియాలగూడెంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎటీఎంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్‌ లక్ష కోట్ల నిధులు గోదావరి పాలు చేసి, బ్యారేజీలో నీళ్లు నిల్వ ఉంచడానికి, సరఫరా చేయటానికి వీలు లేకుండా చేశాడని, కేసీఆర్‌ విధానాలపై ఆయన మండిపడ్డారు. జాతి సంపద లక్ష కోట్లను లక్షణంగా మింగేసారన్నారు. బీఆర్‌ఎస్‌, బిజెపి కలిసికట్టుగా ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు దోపిడీ చేశారన్నారు. దేశంలోని అతిపెద్ద అవినీతిపరుడు కేసీఆర్‌ అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నాణ్యత లేకుండా నిర్మాణం చేయటంతో కుంగిపోయాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్స్‌ ఒరిగిపోయేయాన్నారు. ప్రాజెక్టును సందర్శించకుండా పోలీస్‌ బలగాలను అక్కడ ఉంచటం ఏమిటనే ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అధికారికంగా చెప్పిన ఎందుకు స్పందించడం లేదని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుపై విచారణ చేసి జాతి ప్రజలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. జాతీయ ప్రాజెక్టు సేఫ్టీ అధారిటీ కమిటీ ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని నివేదిక ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మాణం చేసిన నాగార్జునసాగర్‌, శ్రీరామ్‌ సాగర్‌, శ్రీపాద యల్లంపల్లి బ్యారేజీలు దశాబ్దాలుగా సాగునీరు అందిస్తూ చెక్కుచదరలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలను ఎత్తుచూపుతో ప్రజలకు తెలియజేయాలన్నారు. రానున్న కాలంలో ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలంగాణ సమాజానికి తెలియజేసేందుకు పర్యటిస్తామనిపేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌, మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్‌ బాబు, మండల ప్రధాన కార్యదర్శి పందిరి అంజయ్య, భద్రారెడ్డి, పుల్లారెడ్డి, మల్లెల అజరుకుమార్‌, ధర్మనాయక్‌, మహమ్మద్‌ అజ్గర్‌ తదితరులు పాల్గొన్నారు.