‘సుప్రీం’లో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం కోర్టు ధిక్కరణ పిటీషన్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీ కోసం కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్‌ దాఖలు చేసినట్టు జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచ్‌వల్‌ కో ఆపరేటివ్‌ హౌజింగ్‌ సొసైటీ వ్యవస్థాపక సభ్యులు పీవీ రమణారావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పేట్‌ బషీరాబాద్‌లో 38 ఎకరాల భూమిని స్వాధీనం చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని పేర్కొన్నారు. 14 ఏండ్లుగా జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారనీ, రూ.12 కోట్ల 33 లక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించామని వివరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని కోరారు.