ఆగస్టు 15 నుంచి కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల సమ్మె

– టీయుఎంహెచ్‌ఇయూ
– కుటుంబ సంక్షేమ కమిషనర్‌కు సమ్మె నోటీస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర కేంద్రాల్లో పని చేస్తున్న ఐదు వేల మంది కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ- సీఐటీయూ అనుబంధం) డిమాండ్‌ చేసింది. వైద్యారోగ్యశాఖలో 1,520 ఏఎన్‌ఎంల పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేయాలని కోరుతూ ఆగస్టు 15 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సమ్మె నోటీస్‌ను యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ. ఫసియొద్దీన్‌, కె.యాదానాయక్‌ నేతృత్వంలో నాయకులు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ శ్వేతామహంతికి సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎ.కవిత, జి.సుధాకర్‌, సుగుణ, కిరణ్మయి, సంపూర్ణ, సరోజ, అనిల్‌, శ్రీనివాస్‌ తో పాటు ఆదిలాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, గద్వాల, నాగర్‌ కర్నూల్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌ తదితర జిల్లాల నుంచి ఉద్యోగులు పాల్గొన్నారు. వైద్యారోగ్యశాఖలో రాష్ట్రవ్యాప్తంగా 1,520 ఏఎన్‌ఎంల పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌తో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్న ఏఎన్‌ఎంలకు చాలా అన్యాయం జరుగుతుంది. 20 ఏండ్లుగా పని చేస్తున్న ఉద్యోగాలు క్రమబద్దీకరణ కావడం లేదు.రాత పరీక్ష, 20 మార్కుల సర్వీసు వెయిటేజి విధానం వల్ల న్యాయం జరగదు. ఈ నోటిఫికేషన్‌ రద్దు చేసి, కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను సీనియారిటీ ప్రకారం ఖాళీ పోస్టుల్లో రెగ్యులర్‌ చేయాలని…. యూనియన్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేసింది. సోమవారం కోఠిలో నిర్వహించిన సమావేశంలో భూపాల్‌ మాట్లా డుతూ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఫసియొద్దీన్‌, యాదానాయక్‌ మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలందరూ సమ్మె పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌కేవీ, ఏఐటీయూసీ, ఇతర సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.