కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

Contract teachers Should be regularized–  రాష్ట్ర ఉన్నత విద్యామండలి భవనం ముందు కాంట్రాక్ట్‌ లెక్చరర్ల ధర్నా
నవతెలంగాణ-అంబర్‌పేట
రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1445 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భవనం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ టీచర్స్‌ జేఏసీ చైర్మెన్‌ డాక్టర్‌ శ్రీధర్‌కుమార్‌ లోధ్‌ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలని 153 రోజుల నుంచి విశ్వవిద్యాలయాల్లో అనేక విధాలుగా సదస్సులు, రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లు, నిరసనలు, రిలే నిరాహార దీక్షలు చేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. అనేకసార్లు యూనివర్సిటీ అధికారులను, ప్రభుత్వ అధికారులను, విద్యాశాఖ మంత్రిని కలిసినా ప్రయోజనం లేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులందరూ విధుల్ని బహిష్కరించి నిరవధిక సమ్మెకు వెళ్లారని తెలిపారు.
తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ టీచర్స్‌ జేఏసీ వర్కింగ్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఎం.రామేశ్వరరావు మాట్లాడుతూ.. డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను ఏ విధంగా అయితే రెగ్యులరైజ్‌ చేశారో అలాగే యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను కూడా చేయాలని డిమాండ్‌ చేశారు.
జేఏసీ కన్వీనర్‌ డాక్టర్‌ రాజేష్‌ ఖన్నా మాట్లాడుతూ.. ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ స్పందించి కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేసే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీస్‌ కాంట్రాక్ట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకులు, 12 యూనివర్సిటీల ప్రతినిధులు డాక్టర్‌ జి.వెంకటేశ్వర్లు, జరుపుల చందులాల్‌, డాక్టర్‌ వి.వెంకటేష్‌, డాక్టర్‌ హరీష్‌, సుదర్శన్‌రెడ్డి, ఆర్‌డి.ప్రసాద్‌, డాక్టర్‌ సోమేశ్‌ డాక్టర్‌ శ్రీదేవి, డాక్టర్‌ సంగీత్‌ కుమార్‌, కల్పనా, స్వప్న, మంజుల, శశిధర్‌, గాదె కిషన్‌, వాణిశ్రీ, డాక్టర్‌ సతీష్‌ కుమార్‌, రేఖశ్రీ, డాక్టర్‌ ఉష తదితరులు పాల్గొన్నారు.