బినామీల‌కు కాంట్రాక్టు‌లు గులాబాల‌కు ప‌థ‌కాలు

– ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి అజయ్ తీరు
– గడప గడపకు కాంగ్రెస్‌ కు విశేష స్పందన
– అభ్యర్థి ఎవరైనా పార్టీ గెలుపే ధ్యేయం
– దొంగ ఓట్ల నిగ్గుతేల్చుతాం
– కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బినామీలకు కాంట్రాక్టులు… గులాబీలకు పథకాలు అనే తీరుగా బీఆర్‌ఎస్‌ పాలన సాగుతోందని కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి అజరు తీరు అచ్చు ఇలాగానే ఉందని వ్యాఖ్యానించారు. తన బినామీలకు కాంట్రాక్టులు అప్పగించి తక్కువ అంచనాలతో పనులు మొదలుపెట్టి…. అంచనాకు మించిన వ్యయంతో పనులు పూర్తిచేస్తున్నారని ఆరోపించారు. దీనిలోనూ కొన్ని అసంపూర్తి గానే ఉన్నాయన్నారు. గడప గడపకు కాంగ్రెస్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్‌ గెలుపే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ సభ్యునిగా ఎంపిక చేసిన పార్టీ అధినాయకత్వానికి, ఈ పదవి వచ్చేందుకు తోడ్పడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘నవతెలంగాణ’ తో సోమవారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
వివరాలు విజయబాబు మాటల్లోనే…
పువ్వాడ నిగ్గుతేల్చుతాం…
ఒకే అడ్రస్‌తో వేల ఓట్లతో లబ్ధి పొందుతున్న మంత్రి పువ్వాడ బోగస్‌ ఓట్ల నిగ్గుతేల్చుతాం. బినామీలకు వివిధ పనుల కాంట్రాక్టులు అప్పగిస్తూ నాసికరంగా పనులు నిర్వహించి మంత్రి రూ. కోట్లు కూడబెడుతున్నారు. ఈ పనుల్లోనూ కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. అభివృద్ధి కన్నా హడావుడి ఎక్కువైంది. నాలుగు లైట్లు…రెండు రోడ్లు వేసి అభివృద్ధి అంటున్నారు.
గడప గడపన బ్రహ్మరథం…
గడప గడపకు కాంగ్రెస్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పథకాల అమలులో బీఆర్‌ఎస్‌ పక్షపాత ధోరణిని ప్రజలు వివరిస్తున్నారు. ‘గులాబీ’ కార్యకర్తలకు తప్ప మిగిలిన వారికి పథకాలు అందడం లేదని ఆరోపిస్తున్నారు. దళితబంధు, బీసీలకు రూ.లక్ష సాయం, డబుల్‌ బెడ్రూంలు ఇవన్నీ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు తప్ప ఎవరికీ అందలేదు. పథకాల అమల్లో పారదర్శకత లోపిస్తుంది. రుణమాఫీ విషయంలో కేసీఆర్‌ రైతులతో చెలగాటమాడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గడప గడపకు కాంగ్రెస్‌ కొనసాగుతోంది.
– మేనిఫెస్టో కమిటీకి ఎంపికపై హర్షం..
కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీలో చోటు కల్పించిన సోనియా, రాహుల్‌, ఖర్గే, ప్రియాంకగాంధీ, రేవంత్‌రెడ్డి, భట్టి, పొంగులేటి తదితర నేతలకు నా కృతజ్ఞతలు. గడప గడపకు కాంగ్రెస్‌ కార్యక్రమంలో అనేక సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. ఇప్పటికీ మౌలిక వసతులు కూడా లేని అనేకం ఉన్నాయి. రోడ్ల మీదనే రోడ్లు వేసి అభివృద్ధి అంటున్నారు. గడప గడపకు కాంగ్రెస్‌లో మా దృష్టికి వచ్చిన ప్రధాన స్థానిక సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరచేలా కృషిచేస్తా.
– అభ్యర్థులు ఎవరైనా గెలుపే ముఖ్యం…
కాంగ్రెస్‌ పార్టీ తరుపున అభ్యర్థి ఎవరైనా గెలిపించుకోవడమే మా ధ్యేయం. గెలుపే ప్రాతిపదికగా టిక్కెట్ల కేటాయింపు ఉంటుంది. ఖమ్మం నియోజకవర్గం నుంచి 9 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎవరికి టిక్కెట్‌ దక్కినా వారి గెలుపు కోసం కృషి చేస్తాం..