
నవతెలంగాణ కంటేశ్వర్
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఏఎన్ఎం అందర్నీ యధావిధిగా రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఏఎన్ఎం ల ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ యూనియన్ జిల్లా నాయకురాలు విక్టోరియా లు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఎనిహెచ్ఎ(ఎఫ్)లను రెగ్యులర్ చేయుట మరియు నోటిఫికేషన్ 2/2023 క్యాన్సిల్ చేయుట, ఇతర సమస్యలు పరిష్కరించుట నోటిఫికేషన్ నెం. 02/2023 తేది: 26-07-2023 ఎంపిహెచ్ఎ(ఎఫ్). రాష్ట్ర ప్రభుత్వం ఎంపిహెచ్ఎ(ఎఫ్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ 2/2023ను జారీ చేసింది. 1,520 పోస్టుల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని, కాంట్రాక్ట్ సర్వీసెస్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 20 మార్కులు సర్వీస్ వెయిటేజి ఇచ్చారు. మిగిలిన 80 మార్కులు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. వయస్సు పరిమితి కూడా 44 సం॥లు మరియు ఎస్సి, ఎసి, బిసి తదితరులకు అదనంగా 5 సం||లు సడలింపు ఇచ్చారు. నోటిఫికేషన్ ప్రకారం 49 సం||లు దాటిన వారు అప్లై చేసుకోవడానికి కూడా అర్హులు కారు. ఇటువంటి నిబంధనల వల్ల కాంట్రాక్ట్ సర్వీసులో పనిచేస్తున్న 2వ ఏఎన్ఎం, ఇసి ఏఎన్ఎం, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏఎన్ఎంలు, హెచ్ఐ ఏఎన్ఎంల పేరిట పనిచేస్తున్న సుమారు 5 వేల మందికి న్యాయం జరగదు. వీరందరూ గత 20 సం॥లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరిందరినీ యదావిధిగా ఖాళీ పోస్టుల్లో సీనియారిటీ ప్రకారం రెగ్యులర్ చేయడం వల్ల న్యాయం జరుగుతుంది. డిఎస్సి ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ప్రకారం ఎంపికై పని చేస్తున్నారు. మళ్ళీ పరీక్ష రాయమనడం న్యాయం కాదు. ఇప్పటికే చాలా మందికి ఏజ్ బార్ అయింది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరుకుంటున్నారు.వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు సంబంధించి విధి విధానాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు అనుసరించడం శోచనీయం. కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లను మెరిట్ ఆధారంగా సర్వీసుకు వెయిటేజి ఇచ్చి రెగ్యులర్ చేశారు. అలాగే జీఓ నెం. 16 ది. 26-02-2016 ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించి మన డిపార్ట్ మెంట్లో తేది: 03-05-2023న జీఓ నెం. 49 ప్రకారం 68 మంది కాంట్రాక్ట్ ఎంపిహెచ్ఎ (ఫిమేల్) లను యదావిధిగా రెగ్యులర్ చేశారు, అలాగే వివిధ శాఖల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 5 వేలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేశారు. నోటిఫికేషన్ 02/2023ని క్యాన్సిల్ చేయాలని కోరుతున్నాం. ఇదే ప్రకారం మిగిలిన 5 వేల మంది కాంట్రాక్ట్ ఎంపిహెచ్ఎ (ఫిమేల్)లను సీనియారిటీ ప్రకారం ఖాళీ పోస్టులలో రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జ్యోతి శశికళ రూప సునీత సమంత స్రవంతి సవిత తదితరులు పాల్గొన్నారు.