కంట్రోల్‌ చేసుకుంటేనే…

ఈ రోజుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా ఫోన్‌లతో గడిపే సమయం ఎక్కువైపోయింది. సోషల్‌ మీడియా వినియోగమూ పెరిగిపోయింది. గంటల కొద్ది ఫోన్లు, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్స్‌ చూస్తూనే ఉంటున్నాం. సమాచారం పంచుకోవడానికి, విషయాలపై అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడే సోషల్‌ మీడియా ఒక వ్యసనమైపోయింది. ఇలా ఎక్కువ సమయం గడపడం వల్ల మానసిక సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి సోషల్‌ మీడియా డీటాక్స్‌ ఒక్కటే మార్గం అని సూచిస్తున్నారు. మరి సోషల్‌ మీడియా డీటాక్స్‌ అంటే ఏంటి? దీని నుంచి బయటపడటం ఎలాగో.. నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం..
సోషల్‌ మీడియా డీటాక్స్‌ అంటే..
సోషల్‌ మీడియా డీటాక్స్‌ అంటే కొంత సమయం వరకూ సోషల్‌ మీడియాని వాడకపోవడం. ఈ కొంత సమయం అన్నది వారం నుండి, ఆరు నెలల వరకూ ఎంత కాలమైనా కావచ్చు. ఈ ప్రాసెస్‌లో మీరు కొన్ని ఎకౌంట్లని డిలీట్‌ చేయడం, కొన్ని ఎకౌంట్లని టెంపరరీగా డిసేబుల్‌ చేయడం వంటివి చేయాల్సి రావచ్చు.
మీ గురించి ఆలోచించండి
ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకునే హడావిడిలో మన గురించి మనం మర్చిపోతున్నాం. ఇంకొకరి లైఫ్‌లో జరిగే విషయాల పట్ల ఉన్న కుతూహలంలో సగం కూడా మన లైఫ్‌ గురించి ఉండడం లేదు. ఒక్కసారి ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఎవరితో ఎక్కువ కనెక్ట్‌ అవ్వగలుగుతామని? రియల్‌ లైఫ్‌లో కంటికి ఎదురుగా కనిపించే మనిషితోనా, ఆన్‌లైన్‌లో కనిపించే మనిషితోనా? ఈ రెండు ప్రశ్నకి సమాధానం మొదటిదైతే కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇందుకు మొదట ఎంచుకోవాల్సిన మార్గం సోషల్‌ మీడియా డీటాక్సింగ్‌. ఇది తేలికైన విషయం కాదు. ఒక అలవాటు టాక్సిక్‌ లెవెల్‌కి చేరుకుంటేనే డీటాక్స్‌ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కొంచెం ఓపికతో, సహనంతో ఈ పని చేస్తే ఎంత ఫ్రీడమ్‌ వస్తుందో చేసి చూస్తే అర్ధమవుతుంది.
పోల్చుకోవద్దు
సోషల్‌ మీడియాలో ఇతరుల జీవితాన్ని చూసి మన జీవితం కూడా అలా లేదని ఫీలవుతూ ఉంటారు కొందరు. కానీ, ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. అది వారు చూపిస్తున్న జీవితం. అది నిజమే అని కూడా అనుకున్నా, వారి జీవితంతో మన జీవితాన్ని కంపేర్‌ చేసుకుంటే మన మీద మనకి నమ్మకం, గౌరవం తగ్గిపోతాయి. అందుకే, సోషల్‌ మీడియా నుంచి బ్రేక్‌ తీసుకుని మన లైఫ్‌ మీద ఫోకస్‌ పెట్టుకోవాలి.
అవసరమైన యాప్స్‌ మాత్రమే
అన్ని స్మార్ట్‌ ఫోన్‌లలోనూ ఏయే యాప్స్‌ ఎక్కువ సేపు వాడుతున్నాం, టోటల్‌ స్క్రీన్‌ టైం ఎంత అనే వివరాలు ఉంటాయి. దాన్ని బేస్‌ చేసుకుని ఎక్కువ సమయం కేటాయిస్తున్న యాప్స్‌ని అన్‌ ఇన్‌స్టాల్‌ చేసేయండి. దీనివల్ల చాలా ఖాళీ సమయం దొరకడమే కాదు, చాలా విషయాల్లో క్లారిటీ కూడా వస్తుంది.
గ్రేస్కేల్‌ యూజ్‌..
ఫోన్‌లో ఈ సెట్టింగ్‌ చేసుకోడానికి కొన్ని సెకన్ల కంటే ఎక్కువ సేపు పట్టదు. దీని వల్ల యాప్స్‌ కలర్‌ఫుల్‌గా మెరుస్తూ కనబడుతూ మిమ్మల్ని ఎట్రాక్ట్‌ చేయవు. దానితో ఆటోమాటిక్‌గా ఫోన్‌ ఎడిక్షన్‌ కూడా తగ్గిపోతుంది. కలర్స్‌ కనపడని ఫోన్‌ మీద ఇంటరెస్ట్‌ తగ్గిపోవచ్చు. ప్రయత్నిస్తే బాగుంటుందేమో..