ఎగుమతుల వెలవెల

Cost of exports– ఆగస్ట్‌లో 7 శాతం పతనం
– 10 నెలల గరిష్టానికి వాణిజ్య లోటు
న్యూఢిల్లీ : ప్రపంచ మార్కెట్‌లో భారత సరుకులకు డిమాండ్‌ పడిపోతోంది. వరుసగా ఏడో మాసంలోనూ ఎగుమతులు డీలా పడ్డాయి. మరోవైపు ఎగుమతుల కంటే దిగుమతులు అధికంగా ఉండటంతో భారత వాణిజ్య లోటు ఎగిసి పడుతోంది. దీంతో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుత ఏడాది ఆగస్ట్‌లో దేశ ఎగుమతు లు 7 శాతం పతనమై 34.48 బిలియన్‌ డాలర్లకు పరిమితమ య్యాయని శుక్రవారం ప్రభుత్వ గణంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే మాసంలో 37.02 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. గడిచిన నెలలో దిగుమతులు 5.23 శాతం తగ్గి 58.64 బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటంతో దేశ వాణిజ్య లోటు 24.16 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది. దీంతో వాణిజ్య లోటు 10 నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఈ ఏడాది జులైలోనూ ఎగుమతులు 15.88 శాతం క్షీణించాయి. గడిచిన ఆగస్ట్‌లో భారత సరుకులు, సేవల ఎగుమతులు స్థూలంగా 4.2 శాతం తగ్గి 60.87 బిలియన్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో స్థూల దిగుమతులు 5.97 శాతం తగ్గి 72.50 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్ట్‌ కాలంలో భారత సరుకుల ఎగుమతులు 11.9 శాతం క్షీణించి 172.95 బిలియన్లకు తగ్గగా.. అదే సమయంలో దిగుమతులు 2 శాతం తగ్గి 271.83 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి. దీంతో గడిచిన ఐదు మాసాల్లో భారత వాణిజ్య లోటు 98.88 బిలియన్లకు ఎగిసింది. ప్రపంచ దేశాల ఉత్పత్తులతో పోటీ పడలేక పోవడం, గ్లోబల్‌ డిమాండ్‌లోనూ స్తబ్దత నేపథ్యంలో భారత ఎగుమతులు తగ్గిపోతున్నాయని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటంతో భారత వాణిజ్య లోటు ప్రమాదకరంగా మారుతోంది.