నకిలీ కరెన్సీ హల్‌చల్‌

– 14శాతం పెరిగిన రూ.500 దొంగ నోట్లు
– ఇప్పటికీ నగదే కింగ్‌ : ఆర్‌బీఐ వార్షిక నివేదిక వెల్లడి నకిలీ కరెన్సీ హల్‌చల్‌

ముంబయి : దేశంలో నకిలీ కరెన్సీ నోట్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2,25,769 దొంగ నోట్లు పట్టుబడ్డాయి. ఇందులో అత్యధికంగా రూ.500 నోట్లు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2022-23నకు సంబంధించి ఆర్‌బీఐ తన వార్షిక రిపోర్ట్‌ను మంగళవారం విడుదల చేసింది. దీనిలో నకిలీ కరెన్సీ, నగదు చెలామణీ, వృద్ధిరేటు, కరెన్సీ ముద్రణ వ్యయం, ఆర్‌బీఐ బ్యాలెన్ష్‌ షీట్‌ తదితర వివరాలను వెల్లడించింది. ఆ అంశాలు.. ”అన్ని నోట్ల కంటే రూ.500 నోట్లలోనే ఎక్కువ నకిలీలు చలామణీలో ఉన్నాయి. 2022-23లో మొత్తం 91,110 నోట్లను గుర్తించారు. ఇంతక్రితం ఏడాది రూ.500 దొంగ నోట్లతో పోల్చితే.. 14.4 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. అదేవిధంగా 78,699 రూ.100 నోట్లు, 27,258 రూ.200 నోట్లు, 9,806 రూ.2వేల నోట్లను గుర్తించింది. స్థూలంగా రూ.10, రూ.100, రూ.2000 డినామినేషన్లలో గుర్తించిన నకిలీ నోట్లు 11.6శాతం తగ్గాయి. 2021-22లో బ్యాంకింగ్‌ రంగంలో గుర్తించినవి మొత్తం 2,30,971 నకిలీ కరెన్సీ నోట్లు కాగా, 2022-23 సంవత్సరంలో 2,25,769 నోట్లకు మాత్రమే తగ్గింది. మొత్తం నకిలీ కరెన్సీ నోట్లలో ఆర్‌బిఐ వద్ద 4.6 శాతం, ఇతర బ్యాంకుల్లో 95.4 శాతం చొప్పున గుర్తించడం జరిగింది’ అని రిజర్వ్‌ బ్యాంక్‌ తన రిపోర్ట్‌లో తెలిపింది.
డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ దేశంలో నగదు చలామణీనే ఇప్పటికీ
రారాజులా కొనసాగుతోంది. ‘2022-23లో కరెన్సీ నోట్ల చలామణి విలువ 7.8శాతం పెరిగింది. ఇదే సమయంలో నోట్ల సంఖ్య 4.4శాతం పెరిగింది. చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల విలువలో రూ.500, రూ.2,000 నోట్ల విలువే 87.9 శాతం. ఇది 2021- 22లో 87.1 శాతంగా ఉంది. 2023 మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న నోట్లలో సంఖ్యాపరంగా రూ.500 నోట్లే ఎక్కువ. వీటి వాటా 37.9 శాతం. తర్వాత రూ.10 నోట్లు 19.2 శాతం ఉన్నాయి. మొత్తం 5,16,338 లక్షల రూ.500 నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి విలువ రూ.25,81,690 కోట్లుగా ఉంది. రూ.2,000 నోట్లలో 4,55,468 లక్షలు చలామణిలో ఉన్నాయి. వీటి విలువ రూ.3,62,220 కోట్లుగా ఉంది. 2021-22తో పోలిస్తే చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల సంఖ్యలో 1.3 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. రూ.10.69 కోట్ల హోల్‌సేల్‌ ఈ-రూపీలు, రూ.5.70 కోట్ల రిటైల్‌ ఈ-రూపీలో చలామణీలో ఉన్నాయి. నోట్ల ముద్రణ కోసం 2022- 23లో రూ.4,682.80 కోట్లు వ్యయం అయ్యింది. ఇంతక్రితం ఏడాది ఇది రూ.4,984.80 కోట్లు ఖర్చు అయ్యింది’ అని ఆర్‌బీఐ వెల్లడించింది.
రూ.2.30 లక్షల కోట్ల బంగారం నిల్వలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో భారత వృద్ధి పెరగనుందని ఆర్‌బీఐ వార్షిక రిపోర్ట్‌లో అంచనా వేసింది. కమోడిటీ ధరలు, ద్రవ్యోల్బణం తగ్గుతున్నందున్న జీడీపీకి మద్దతు లభించనుందని పేర్కొంది. 2022-23లో అధిక ఆదాయం ద్వారా ఆర్‌బీఐ బ్యాలెన్ష్‌ షీట్‌ 2.5 శాతం పెరిగి రూ.63.45 లక్షల కోట్లకు చేరింది. ఇది ఇంతక్రితం ఏడాది రూ.61.90 లక్షల కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం ఆర్‌బీఐ ఆదాయంలో 47.06 శాతం వృద్ధి చోటుచేసు కోగా.. వ్యయం 14.05శాతం పెరిగింది. మిగులు నిధులు 188 శాతం వృద్ధితో రూ.87,416 కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం 2021-22లో రూ.30,307 కోట్ల మిగులు నిధులు చోటు చేసుకున్నాయి. మిగులు నిధుల నుంచే కేంద్రానికి డివిడెండ్‌ రూపంలో చెల్లిస్తుంది. ఆర్‌బీఐ వద్ద మొత్తం బంగారం 760.42 మెట్రిక్‌ టన్నుల నుంచి 794.63 మెట్రిక్‌ టన్నులకు చేరింది. విలువ పరంగా 17.20 శాతం పెరిగి రూ.2,30,733.95 కోట్లకు చేరింది. ఇది 2022 మార్చి ముగింపు నాటికి రూ.1,96,864.38 కోట్లుగా ఉంది.