నేటినుంచి సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర

– వరంగల్‌లో ప్రారంభించనున్న సీతారాం ఏచూరి
– 29న హైదరాబాద్‌లో ముగింపు సభకు ప్రకాశ్‌ కరత్‌
– రాజ్యాంగాన్ని రక్షిద్దాం…దేశాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ప్రజల్లోకి
– ప్రజాస్వామ్యం, లౌకికత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయ పరిరక్షణే లక్ష్యం
– బీజేపీ మతోన్మాదం, కార్పొరేట్‌ విధానాలపై పోరాటం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో శుక్రవారం నుంచి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ‘జనచైతన్య యాత్ర’కు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణలోని 33 జిల్లాలు పర్యటిస్తూ ఈ బస్సుయాత్రలు జరగనున్నాయి. మొదటి యాత్రను శుక్రవారం వరంగల్‌లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభిస్తారు. వరంగల్‌లోని ఆజంజాహిమిల్స్‌ గ్రౌండ్‌లో సీపీఐ(ఎం) వరంగల్‌ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఏచూరితోపాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, బృంద నాయకులు పోతినేని సుదర్శన్‌ పాల్గొని ప్రసంగిస్తారు. ఈనెల 23న ఆదిలాబాద్‌లో రెండో యాత్రను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రారంభం చేస్తారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య ఈ యాత్రకు నాయకత్వం వహిస్తారు. ఈనెల 24న నిజామాబాద్‌లో మూడో యాత్రను ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ ఎ విజయరాఘవన్‌ ప్రారంభిస్తారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ ఈ యాత్రకు సారధ్యం వహిస్తారు. ఈనెల 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద జరిగే ముగింపు సభకు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ ముఖ్యఅతిధిగా హాజరవుతారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ అనుసరిస్తున్న మతోన్మాదం, కార్పొరేట్‌ అనుకూల విధానాలపై ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుంది. రాజ్యాంగాన్ని రక్షిద్దాం, దేశాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనుంది. ప్రజాస్వామ్యం, లౌకికత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయం పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగనుంది. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న బీజేపీ విధానాలను ప్రజల్లో ఎండగట్టి వారిలో చైతన్యం పెంపొదించడం కోసమే ఈ యాత్రను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ చేపడుతున్నది. గవర్నర్‌ వ్యవస్థ ద్వారా ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు దేశానికి ఎంత ప్రమాదకరమో ప్రజలను మత ప్రాతిపదికన విభజించి విద్వేషాలను రెచ్చగొట్టి పాలన సాగించడం వల్ల లౌకికత్వానికి ఎంతటి ముప్పో ఈ యాత్ర వివరించనుంది. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్‌ఐఏ వంటి వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా వాడుకుంటున్నదో ప్రజల్లోకి తీసుకెళ్తారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా దాడులు చేయడం, అరెస్టులకు పాల్పడడం గురించి ప్రస్తావిస్తుంది.
ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణతో రిజర్వేషన్లకు నష్టం
ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేసి కార్పొరేట్‌ శక్తులకు కారుచౌకగా ఎలా అమ్ముతున్నదో, దానివల్ల దళితులు, వెనుకబడిన తరగతుల ప్రజలు రిజర్వేషన్లను ఎలా కోల్పోతారో, నిరుద్యోగులు ఉద్యోగాలను ఎలా నష్టపోతారో ఈ యాత్ర తెలియజేయనుంది. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ మూల సిద్ధాంతం అయిన మనువాద భావజాలాన్ని చాతుర్వర్ణ వ్యవస్థను, కులవ్యవస్థను కొనసాగించడం కోసం చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టనుంది. మనువాదం వల్ల ప్రమాదాలను, సామ్యవాదం వల్ల ప్రయోజనాలను ప్రజల ముందుంచనుంది. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌తోపాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల సామాన్యులు ఎంత సతమతమవుతున్నారో గుర్తు చేయనుంది. ప్రజాసంక్షేమానికి కోతలు పెడుతూ కార్పొరేట్‌ శక్తులకు రాయితీలు కల్పించే మోడీ విధానాలను ప్రజలకు ఈ యాత్ర ద్వారా అర్థం గావించనుంది. వామపక్ష, అభ్యుదయ భావజాలం ఉన్న తెలంగాణలో ప్రజల ఐక్యతకు చిచ్చుపెట్టే బీజేపీ విభజన రాజకీయాల గుట్టు విప్పనుంది. ఇంకోవైపు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనూ సీపీఐ(ఎం) నాయకులు ఈ యాత్రలో ప్రస్తావిస్తారు. ముఖ్యంగా ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్‌ బెడ్రూం ఇండ్లు, పోడు భూములకు పట్టాల వంటి సమస్యలపై ప్రజలను సంఘటితం చేసేలా ఈ యాత్ర కర్తవ్యాల్లో భాగంగా ముందుకు సాగనుంది. జనచైతన్య యాత్రలో నేతల ప్రసంగాలతోపాటు పది లక్షల కరపత్రాలు, రెండు లక్షల పోస్టర్లు, బుక్‌లెట్లు, ఆడియో, వీడియో సందేశాల ద్వారా బీజేపీ ప్రమాదం పట్ల ప్రజలను మేల్కొల్పడమే లక్ష్యంగా ఈ యాత్ర ముందుకెళ్లనుంది.