ఈడీ విచారణకు కవిత గైర్హాజరు

– చట్ట ప్రకారం విచారణ జరగట్లేదు..
– అందుకే హాజరు కాలేదు.. : కవిత తరపు న్యాయవాది సోమా భరత్‌
– 20న హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మళ్లీ నోటీసులు
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నాటకీయ పరిణామాల మధ్య బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఈడీ ముందు హాజరుకాలేదు. తన నిర్ణయాన్ని తెలియజేస్తూ ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేందర్‌కు రాసిన ఆరు పేజీల లేఖను బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది సోమా భరత్‌ కుమార్‌ను ఈడీ కార్యాలయానికి పంపారు. తన అనారోగ్య కారణాలతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని తెలిపారు. దీంతో 20న వ్యక్తిగతంగా హాజరుకావాలని కవితకు ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. ఈడీకి పంపిన లేఖలో ‘మీరు ఇచ్చిన నోటీసుల్లో వ్యక్తిగత హాజరుపై స్పష్టత లేనందున.. నా ప్రతినిధిని పంపుతున్నాను. సుప్రీంకోర్టులో జరిగే విచారణలు పవిత్రమైనవి కాబట్టి, సమన్లకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవడానికి ముందు సుప్రీంకోర్టు విచారణ కోసం వేచి ఉండాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘మహిళలను ఆఫీస్‌కు పిలిపించి విచారించకూడదు. నేను ఆడియో, వీడియో మోడ్‌లో విచారణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తునకు నేను సహకరించాను. ఈడీ ప్రశ్నలకు నాకు తెలిసిన మేరకు సమాధానాలిచ్చాను. ఆ రోజు రాత్రి 8 గంటల వరకు విచారించారు. మళ్లీ విచారణకు రావాలని సమన్లు ఇచ్చారు. అధికారులు నా నివాసానికి వచ్చి విచారించవచ్చని అభ్యర్థించాను. అయితే, నా అభ్యర్థనను తిరస్కరించారు’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని ఆమె ఈడీకి తెలియజేశారు.
మంత్రులు, న్యాయ నిపుణులతో భేటీ
ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌ గౌడ్‌, సత్యవతి రాథోడ్‌ తదితరులు గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ నివాసంలో మంత్రులు, న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. ఎమ్మెల్సీ కవితపై ఈడీ అధికారులు అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె తరపు న్యాయవాది భరత్‌ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మహిళను ఇంటి వద్దే విచారించాలని తెలిపారు. కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్‌ ఈ నెల 24న విచారణకు రానుందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తదుపరి ఆదేశాల ప్రకారమే తాము ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
పిళ్లైకి నాలుగు రోజుల కస్టడి పొడిగింపు
ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అరుణ్‌ రామచంద్ర పిళై కస్టడి ముగియడంతో ఈడీ అధికారులు గురువారం రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈడీ వాదనలు వినిపిస్తు ‘ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరితో కలిపి పిళ్లైని ప్రశ్నించాల్సి ఉంది. 20 రోజుల కస్టడిలో పిళ్ళై ముందు హౌటల్‌ రికార్డ్స్‌, పత్రాలు ఉంచి, విచారణ చేశాం. కొందరు నిందితులు, సాక్షులను కలిపి జరుపుతున్న విచారణ ఇంకా పూర్తి కాలేదు. అందుకని వారిని మరోసారి విచారణకు రావాలని ఆదేశించాం. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత గురువారం ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఈ పరిస్థితుల్లో పిళ్లై కస్టడి ఐదు రోజులు పొడిగించాలి. పిళ్లై కస్టడీ పొడిగిస్తే శుక్రవారం బుచ్చిబాబుతో కలిసి ప్రశ్నిస్తాం” అని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరింది. వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు మరో నాలుగు రోజుల పాటు పిళ్లై కస్టడి పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసులోనే వైసీపీ ఎంపి శ్రీనివాసుల రెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. బెయిల్‌పై బయటున్న బుచ్చిబాబును విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన 17న ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

Spread the love