16న మళ్లీ విచారణ

– ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో…ఎమ్మెల్సీ కవితను 9 గంటలు ప్రశ్నించిన ఈడీ
న్యూఢిల్లీ : మళ్లీ ఈనెల 16న విచారణకు రావాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శనివారం ఎమ్మెల్సీ కె. కవిత ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. తొలుత మంత్రి, సోదరుడు కేటీఆర్‌, లీగల్‌ సభ్యులతో కవిత కాసేపు చర్చించారు. అనంతరం ఉదయం 9 గంటలకు భారత జాగృతి కార్యకర్తలు, బీఆర్‌ఎస్‌ శ్రేణులకు సీఎం నివాసంలో బ్రేక్‌ ఫాస్ట్‌ ఇచ్చారు. తరువాత కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు కవితకు మద్దతుగా సంఘీభావం తెలిపారు. అనంతరం తుగ్లక్‌రోడ్‌లోని సీఎం కేసీఆర్‌ నివాసం నుంచి 10 వాహనాల కాన్వారులో అబ్దుల్‌ కలాం రోడ్‌లోని ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న కవిత, తన పిడికిలి బిగించి అభివాదం చేస్తూ ఈడీ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. కవిత వెంట వచ్చిన భర్త అనిల్‌, న్యాయవాది మోహన్‌రావు ఈడీ కార్యాలయానికి చేరుకోగా, వారిని ఈడీ అధికారులు బయటే ఆపేశారు. ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన కవిత రాత్రి 8 గంటల సమయంలో బయటకు తిరిగొచ్చారు. సుదీర్ఘంగా దాదాపు 9 గంటల పాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. మధ్యలో గంటసేపు భోజనం విరామం ఇచ్చారు. అయితే ఆమె ఆహారం తీసుకునేందుకు నిరాకరించినట్టు తెలిసింది. కవితను ఐదుగురు అధికారుల బృందం ప్రశ్నించింది. ఇందులో ఒక జాయింట్‌ డైరెక్టర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయి మహిళా అధికారి, లిక్కర్‌ స్కాంలో ఇన్వెస్ట్‌ గేషన్‌ ఆఫీసర్‌(ఐఓ) జోగిందర్‌, మరో ఇద్దరు అసిస్టెంట్‌ డైరెక్టర్లు ఉన్నారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ (పిఎంఎల్‌ఎ) సెక్షన్‌ 50 కింద కవిత స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. తొలుత ఆమె వ్యక్తిగత వివరాలను రికార్డ్‌ చేసుకున్న అధికారులు, అనంతరం మద్యం కుంభకోణానికి సంబంధించిన విచారణ ప్రారంభించారు. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్‌ మెంట్‌ రికార్డు చేశారు. విచారణ ముగిసిన అనంతరం ఈడి కార్యాలయం నుంచి కవిత బయటకు రాగానే ఆమె మద్దతుదారులు జై బీఆర్‌ఎస్‌.. జై కేసీఆర్‌.. జై కవితక్క అంటూ నినాదాలు హౌరెత్తించారు. వారికి నమస్కారం తెలుపుతూ ఆమె తుగ్లక్‌ రోడ్డులోని కేసీఆర్‌ నివాసానికీ, అక్కడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
సౌత్‌ గ్రూప్‌లో మీ పాత్ర ఏంటీ….?
ఈడీ ఆరోపిస్తున్నట్టు ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన సౌత్‌ గ్రూప్‌తో కవితకు ఉన్న సంబంధాలపై విచారించినట్టు సమాచారం. అరుణ్‌ పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్‌, శరత్‌ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, సమీర్‌ మహేంద్రు, అమిత్‌ అరోరా ఇచ్చిన సమాచారంతో ఈడీ కవితను ప్రశ్నించింది. విచారణ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణలు, వాట్సాప్‌ చాట్‌లు, డిజిటల్‌ ఆధారాలను కవిత ముందుంచినట్ట విశ్వసనీయ సమాచారం. వాటి ఆధారంగా సౌత్‌ గ్రూప్‌లో కవిత పాత్ర పై ఈడి ప్రశ్నలు వర్షం కురిపించినట్లు తెలిసింది. ‘లిక్కర్‌ పాలసీ రూపొందిస్తోన్న విషయం ఎలా తెలుసు? అందులో చేరాలని ఎవరు కోరారు? ఇందుకోసం ఎవరు సంప్ర దించారు.? అని ప్రశ్నించినట్టు తెలిసింది. నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్‌ కంపెనీలో వాటాలు, రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారం’ వంటి ప్రశ్నలకు సమాధానం కోరింది. ఢిల్లీ, హైదరాబాద్‌ వేదికగా జరిగిన సమావే శాలను ప్రస్తావించింది. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారం, హవాల మార్గం లో వాటిని తరలించిన తీరుపై ప్రశ్నించింది. అలాగే ఒకటి రెండు రోజుల తేడా లో తనకు చెందిన రెండు ఫోన్‌ నెంబర్లు కలిగిన మొత్తం 10 విలువైన ఫోన్ల ధ్వం సానికి కారణాలను అడిగినట్లు సమాచారం. అదే సమయంలో మిగితా నిందితు లూ ఫోన్లు ధ్వంసం చేయడం వెనక ఉన్న ఉద్దేశాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది.
పిళ్లైతో కలిపి విచారణ..?
ఉదయం రెండు గంటల పాటు కవితను ఒంటిరిగా ఈడి ప్రశ్నించింది. అయితే, మధ్యాహ్నం తరువాత తమ కస్టడీలో ఉన్న ఆమె అనుచరుడు, మద్యం వ్యాపారి అరుణ్‌ పిళ్లైతో కలిసి విచారించినట్లు సమాచారం. కవిత ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని ప్రశ్నలను, పిళ్లై సమక్షంలో క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసినట్లు తెలిసింది. తాను కవిత బినామినంటూ పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ప్రస్తావించింది. ‘ఢిల్లీ మద్యం కుంభకోణం గురించి నాకేం తెలీదు. నేను కుట్ర దారురాలిని కాదు. నేనేం ఆధారాలు ధ్వంసం చేయలేదు’ అని కవిత చెప్పినట్టు సమాచారం.
భారీ భద్రత
ఈడీ విచారణకు కవిత హాజరైన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు హడావుడి చేశారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే మార్గాల్లో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు ఈడీ కార్యాలయం వద్దకు చేరుకోకుండా ఢిల్లీ పోలీసులు భద్రతను భారీగా పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఈడీ కార్యాలయ పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలు చేశారు. మరోవైపు సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ సమయాన్ని పెంచారు. రూల్‌ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బిఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి.
ఢిల్లీలోనే మంత్రుల మకాం…
కవిత ఈడీ విచారణ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఏడుగురు మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, మహమ్ముద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌ రెడ్డిలు ఢిల్లీలోనే మకాం వేశారు. శుక్రవారం రాత్రికే మంత్రి కేటిఆర్‌, హరీష్‌ రావు ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ నివాసంలో కేటీఆర్‌, హరీష్‌ రావు, కవిత, లీగల్‌ టీం భేటీ అయ్యారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు దిష్టిబొమ్మ దగ్ధం
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ముందు బండి సంజరు దిష్టి బొమ్మను దహనం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజరుపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రేఖా శర్మకు తెలంగాణ ఫుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజరు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా సమాజం తీవ్రంగా ఖండిస్తుందని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్‌ మాట్లాడారు. బండి సంజరు అనుచిత వ్యాఖ్యలపై గవర్నర్‌ తమిళిసై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో చీమ చిటుక్కుమంటే స్పందించే గవర్నర్‌ ఇప్పుడేం చేస్తున్నారని నిలదీశారు. సంజరు వ్యాఖ్యలపై గవర్నర్‌ స్పందించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలకు తావు లేదని సత్యవతి రాథోడ్‌ స్పష్టం చేశారు. సంజరు రాజకీయ విలువల్లేని వ్యక్తి అని విమర్శించారు. మహిళలను ఏ మాత్రం గౌరవించకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమన్నారు. మహిళలు తల దించుకునేలా బండి సంజరు మాట్లాడానని, ఆయన మాట్లాడే ప్రతి మాట వ్యక్తిగతమా..? పార్టీ లైనా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈడీ, సీబీఐ దాడులకు తెలంగాణ బిడ్డలు భయపడరని సత్యవతి రాథోడ్‌ స్పష్టం చేశారు.

Spread the love