10 గంటలు ఇంటరాగేషన్‌

– నేడు మళ్లీ ఈడీ ముందుకు కవిత
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను పది గంటలపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ చేసింది. మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కవితను మంగళవారం ( మార్చి 21) ఉదయం 11 గంటలకు రమ్మన్నారు. సోమవారం కవితను ఈడీ అధికారులు సుధీర్ఘంగా విచారించారు. డాక్యుమెంటేషన్‌, వాంగ్మూలంపై కవిత సంతకాలు కూడా తీసుకున్నారు. ఈడీ సంధించిన పలు ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్‌ కూడా లేదని తెలిసింది. మొత్తం 20 ప్రశ్నలు కవితకు సంధించినట్టు తెలిసింది. ఉదయం కవిత, అరుణ్‌ పిళ్లైని కలిపి ఈఞీ అధికారులు విచారించారు. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, మద్యం కుంభకోణంలో సౌత్‌ గ్రూప్‌ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలుత ఉదయం 10.20 గంటలకు సీఎం కేసీఆర్‌ నివాసంలో అందరికీ పిడికిలి చూపిస్తూ అభివాదం చేశారు. అక్కడ నుంచి తన భర్త అనిల్‌తో కలిసి కవిత ఈడీ ప్రధాన కార్యాల యానికి చేరుకున్నారు. అక్కడ ఆమె భర్తను నిలిపివేశారు. ఆమె ఒక్కరినే అనుమ తించారు. విచారణ అనంతరం కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చే ముందు కారు ఎక్కుతూ విక్టరీ సింబల్‌ చూపించారు. ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్‌ ఏజీ, సోమా భరత్‌, గండ్ర మోహన్‌ రావు వెళ్లారు.

భయపడి కాదు… చట్టంపై గౌరవంతో: ఎంపీ రంజిత్‌ రెడ్డి
ఈడీ ముందు కవిత విచారణకు హాజరవుతారని బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి ముందుగానే మీడియాకు వెల్లడించారు. కవిత భయపడి ఈడీ ముందు విచారణకు హాజరుకావడం లేదని, చట్టంపై ఉన్న గౌరవంతో విచారణకి వెళ్తున్నట్టు చెప్పారు. ప్రతిపక్షాలను టార్గెట్‌ చేసి కేంద్రం దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తోందని ఆరోపించారు. ఇతరులపై విచారణ చేయ కుండా, కేవలం ప్రతిపక్షాలపై దాడులు జరుపుతున్నారని విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో కవితకేం సంబంధం: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

ఢిల్లీ మద్యం కుంభకోణంతో బిఆర్‌ ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం అని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కవిత విచారణకు హాజరయ్యే ముందు ఆయన తుగ్లక్‌ లోని నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్బం గా మీడియాతో మాట్లాడు తూ.. తెలంగాణ ఆడ బిడ్డపై కేంద్రం కక్ష గట్టిందని ఆరోపించారు. దర్యాప్తు సంస్థల ను ఆమె పై ఉసిగొల్పుతున్నారన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలు కేంద్రం చేతుల్లో ఉంటాయన్నారు. వాళ్లు ఎలా చెప్తే దర్యాప్తు సంస్థలు అలా వింటాయన్నారు. అదానీ లక్షల కోట్లు దోచుకుంటే దానిపై పార్లమెంట్‌ లో చర్చ, దర్యాప్తు సంస్థలతో విచారణ లేదని విమర్శించారు.
ఏప్రిల్‌ 3 వరకు మనీశ్‌ సిసోడియా కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మద్యం కుంభంకేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా జ్యుడిషీయల్‌ కస్టడిని ఏప్రిల్‌ 3 వరకూ రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. మనీశ్‌ సిసోడియా జ్యుడిషియల్‌ కస్టడీ ముగియడంతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సిబిఐ ప్రత్యేక కోర్టులో
ఆయనను సీబీఐ హాజరుపరిచింది.
అరుణ్‌ పిళ్లైకి 14 రోజుల కస్టడి పొడిగింపు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరుణ్‌ రామ చంద్ర పిళ్లైకి సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. ఏప్రిల్‌ 3 వరకు రిమాండ్‌కు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటి వరకు ఈడి కస్టడీకి అప్పగిస్తూ విధించిన 14 రోజుల గడువు ముగియడంతో సోమవారం అరుణ్‌ పిళ్లై ని అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్‌ పాల్‌ ముందు హాజరుపరిచారు. అరుణ్‌ పిళ్లై తరపున సీనియర్‌ అడ్వకేట్లు మనుశర్మ, అనుజ్‌ తివారి, కౌశల్‌ జీట్‌ కైత్‌లు హాజరయ్యారు.
అభిషేక్‌ బోయిన్‌పల్లికి బెయిల్‌ నిరాకరణ
మద్యం కుంభంకోణంలో ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న అభిషేక్‌ బోయిన్‌పల్లికి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. అభిషేక్‌కి మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

 

Spread the love