నుహ్, గురుగ్రామ్‌ల్లో నేడు సీపీఐ(ఎం) బృందం పర్యటన

న్యూఢిల్లీ : మతపరమైన హింసాకాండ చెలరేగిన నుV్‌ా, గురుగ్రామ్‌ల్లో గురువారం సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం పర్యటించనుంది. బాధితులకు సానుభూతి, సంఘీభావం ప్రకటించనుంది. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు నిలోత్పల్‌ బసు నేతృత్వంలోని ఈ బృందంలో పార్లమెంట్‌ సభ్యులు జాన్‌ బ్రిట్టాస్‌, ఎఎ రహీమ్‌, వి.శివదాసన్‌ సభ్యులుగా ఉన్నారు.
బీజేపీకి అనుమతి, ఆప్‌కు నో
నుహ్ లో బుధవారం బీజేపీ ప్రతినిధుల బృందం పర్యటించింది. అక్కడి అధికారులను కలుసుకుంది. అక్కడి ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంది. బీజేపీ బృందానికి ఆ పార్టీ హర్యానా రాష్ట్ర అధ్యక్షులు ఓం ప్రకాశ్‌ ధన్‌కర్‌ అధ్యక్షత వహించారు. కాగా, నుహ్ లో పర్యటనకు బీజేపీ బృందానికి అనుమతించిన జిల్లా అధికారులు ఆప్‌ బృందాన్ని మాత్రం అడ్డుకున్నారు. నుహ్ లో పర్యటనకు వెళుతున్న ఏడుగురు సభ్యులు ఉన్న ఆప్‌ బృందాన్ని రోజ్‌కా మో పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రెవసన్‌ గ్రామం వద్ద పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. వెనక్కి పంపారు. బీజేపీ బృందాన్ని అనుమతించి తమను అడ్డుకోవడంపై ఆప్‌ నాయకులు మండిపడ్డారు. కాగా, మంగళవారం 10 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్‌ బృందాన్ని కూడా     నుహ్ లో పర్యటించకుండా పోలీసులు అడ్డుకున్నారు. అంతకు ముందు ఆదివారం నలుగురు సభ్యులు ఉన్న సీపీఐ బృందాన్ని కూడా అధికారులు నిరోధించారు.