దాదూస్‌ స్వీట్స్‌

ఎదుట పర్యావరణ కియోస్క్‌లు
అది మా సామాజిక బాధ్యత-ఎమ్‌డీ రాజేష్‌దాదు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పర్యావరణ పరిరక్షణలో తమవంతు పాత్రను పోషించేందుకు దాదూస్‌ స్వీట్స్‌ సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌, పూనాల్లోని తమ స్టాల్స్‌ ఎదుట ఖాళీ స్వీట్‌ బాక్సుల్ని కియోస్క్‌ల్లో డిపాజిట్‌ చేస్తే పదిశాతం డిస్కౌంట్‌ ఇస్తామని ప్రకటించింది. దీన్ని తమ సంస్థ సామాజిక బాధ్యతగా భావిస్తుందని దాదూస్‌ స్వీట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ దాదూ తెలిపారు. ఒక్క టన్ను స్వీట్‌బాక్సుల తయారీలో 17 చెట్లను కొట్టాల్సి వస్తుందనీ, 1,450 లీటర్ల ఆయిల్‌, 26,500 లీటర్ల నీరు, 4వేల యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతుందని ఆయన చెప్పారు. కియోస్క్‌ల ద్వారా ఖాళీ స్వీట్‌బాక్సుల్ని సేకరించి, వాటిని రీసైకిల్‌ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు, ఖర్చునూ నివారించవచ్చని వివరించారు. పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా తాము ఈ కియోస్క్‌ల్ని ఏర్పాటు చేశామనీ, వాటిని రీసైకిల్‌ చేస్తామని రీసస్టైనబిలిటీ సంస్థ సీఈఓ మసూద్‌ మల్లిక్‌ తెలిపారు. భారతదేశంలో 48 శాతం మందికి మాత్రమే పర్యావరణంపై అవగాహన ఉన్నదని ఓ సర్వేలో తేలిందనీ, మిగిలిన వారికీ దీనిపై బాధ్యతను పెంచాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.