డీఆర్‌ఏఎల్‌లో రిలయన్స్‌ వాటాల కొనుగోలుకు డస్సాల్ట్‌ ఆసక్తి

న్యూఢిల్లీ : ఉమ్మడి భాగస్వామ్యంలో నడుస్తున్న డస్సాల్ట్‌ రిలయన్స్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (డీఆర్‌ఏఎల్‌)లో అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ సంస్థ వాటాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌ వైమానిక సంస్థ డస్సాల్ట్‌ ఏవియేషన్‌ ఆసక్తి చూపుతోంది. నాగపూర్‌కు చెందిన డీఆర్‌ఏఎల్‌లో డస్సాల్ట్‌కు 49%, రిలయన్స్‌ డిఫెన్స్‌కు 51% వాటాలు ఉన్నాయి. రిలయన్స్‌ వాటాల కొనుగోలుపై డస్సాల్ట్‌ ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తగిన పెట్టుబడులు లేకపోవడంతో డీఆర్‌ఏఎల్‌ విస్తరణ నిలిచిపోయింది. ఈ రెండు సంస్థలు కలిసి ఉమ్మడిగా 2016 అక్టోబర్‌ 3న డీఆర్‌ఏఎల్‌ను ఏర్పాటు చేశాయి. 2022 నాటికి 650 మంది ఉద్యోగులను నియమించుకొని, శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాయి. అయితే అనిల్‌ అంబానీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఇది కార్యరూపం దాల్చలేదు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐలు) వంద శాతం అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వాటాల కొనుగోలుకు త్వరలోనే అనుమతి లభిస్తుందని డస్సాల్ట్‌ ఆశిస్తోంది. నాగపూర్‌లోని డీఆర్‌ఏఎల్‌ సంస్థలో రఫేల్‌ యుద్ధ విమానాల తయారీకి అవసరమైన విడిభాగాలను ఉత్పత్తి చేస్తారు. అయితే ఈ ప్రక్రియ ప్రస్తుతం నెమ్మదించింది. ప్రారంభంలో ఈ సంస్థలో ఫాల్కన్‌ విమానాల విడిభాగాలను ఉత్పత్తి చేసేవారు. 2019 జూన్‌లో రఫేల్‌ యుద్ధ విమానాల విడిభాగాల ఉత్పత్తి ప్రారంభమైంది.