డీసీపీని వెంటనే సస్పెండ్‌ చేయాలి

– సమస్యలపై పోరాటాలు చేస్తే దాడులు చేస్తారా..
– ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్‌.. ఇదేనా ప్రజాస్వామ్యం?
– ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి. నాగరాజు, కోటంరెడ్డి
– వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన
నవతెలంగాణ-అంబర్‌పేట
విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెక్రటేరియట్‌ ముట్టడి నిర్వహించిన ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులపై భౌతిక దాడికి పాల్పడిన సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి.నాగరాజు, కోటంరెడ్డి డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులపై దాడిని ఖండిస్తూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులపై దాడి చేసిన డీసీపీ వెంకటేశ్వర్లుకు కనీస రాజ్యాంగ అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే.. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే భౌతిక దాడులు చేయడమా అని ప్రశ్నించారు. డీసీపీని సస్పెండ్‌ చేసే వరకు తమ పోరాటం ఆపబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ కార్యదర్శులు జావిద్‌, అశోక్‌రెడ్డి, నాయకులు అశోక్‌, స్టాలిన్‌, పుట్ట లక్ష్మణ్‌, నాగరాజు, సయ్యద్‌ వలీ ఉల్ల ఖాద్రీ, వెంకటేష్‌, మణికంఠ రెడ్డి, ఇటిక్యాల రామకృష్ణ, రెహమాన్‌, గ్యార క్రాంతి, రఘురాం, గ్యార నరేష్‌, బాషాబోయిన సంతోష్‌, రామరాపు వెంకటేష్‌, చైతన్య, రంజిత్‌, రాము యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.