– కార్పొరేట్ల ఆదాయాన్ని పెంచే పనిలో పాలకులు
– కేరళ తరహా ప్రభుత్వం మనకు రావాలి
– చట్టసభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండాలి
– సత్తుపల్లి సీపీఐ(ఎం) అభ్యర్థి మాచర్ల భారతి
నవతెలంగాణ-సత్తుపల్లి
ప్రజా సమస్యలను పట్టించుకొనే పాలకులు కరువయ్యారని, ప్రజల సమస్యలను చట్టసభల్లో చర్చించే ప్రజా ప్రతినిధులు మచ్చుకైనా లేరని సత్తుపల్లి అసెంబ్లీ సీపీఐ(ఎం) అభ్యర్థి మాచర్ల భారతి అన్నారు. బుధవారం సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బోసుబొమ్మ సెంటర్, జలగంనగర్, వెంగళరావునగర్, విరాట్‌నగర్, సింగరేణి క్వార్టర్స్, ద్వారకాపురి, గాంధీనగర్, జవహర్‌నగర్, గుడిపాడు, అంబేద్కర్‌నగర్, అయ్యగారిపేట, గ్యాస్ గోడౌన్ ఏరియా, సిద్దారం రోడ్డు, రాజీవ్‌నగర్ ప్రాంతాల్లో భారతి సీపీఐ(ఎం) శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమాల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పాలన సాగిస్తూ, ప్రజల కోసమే మనమున్నామని భావిస్తూ ప్రజారంజక పాలన సాగిస్తున్న సీపీఐ(ఎం) ఆధ్వర్యంలోని కేరళ తరహా ప్రభుత్వం మనకు రావాలని మాచర్ల భారతి అన్నారు. 14 రకాల నిత్యావసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా అక్కడి ప్రభుత్వం ముఖ్యమంత్రి పినరయి ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. గూడులేని పేదలకు ఇండ్లు కట్టించడం, విద్యా. వైద్యానికి పెద్దపీట వేయడం, వెనుకబాటుగా ఉన్న సామాజిక వర్గాలను ఆదుకోవడం లాంటి అనేక కార్యక్రమాలను కేరళ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఆ విధంగా పాలన సాగించే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొనే విధంగా ప్రజలు ఆలోచన చేయాలన్నారు. అంతేగాని నోట్‌కు ఓటు వేసే విధానం ఉన్నం కాలం పాలకులకు ప్రజల సమస్యలు పట్టవన్నారు. ఈ విధానం సమూలంగా నశించి పాలకులు ప్రజల గురించి ఆలోచించే రోజు రాకమానదని భారతి స్పష్టం చేశారు. ఈ విధమైన భావజాలం ఉన్న సీపీఐ(ఎం) తరపున సత్తుపల్లి నుంచి పోటీచేస్తున్న నన్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించడానికి సుత్తీ కొడవళి నక్షత్రం గుర్తుపై ఓట్లేయాలని భారతి ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, మాదినేని రమేశ్, జాజిరి శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి రావుల రాజబాబు, కొలికపోగు సర్వేశ్వరరావు, బాల బుచ్చయ్య, చావా రమేశ్, మోరంపూడి వెంకటరావు, సంపత్, సైదా, రామకృష్ణ, బడేమియా, కోటయ్య, ఐద్వా నాయకురాళ్లు జాజిరి జ్యోతి, పాకలపాటి ఝాన్సీ, చెరుకు కుమారి, చావా కవిత, తెనాలి పుష్ప, బండ బసవమ్మ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పఠాన్ రోషిని పాల్గొన్నారు.