క్షీణిస్తున్న మహిళా కార్మిక శక్తి !

దేశంలో ఉపాధి రంగంలో 20శాతం కన్నా తక్కువమందే
లింగ సమానత్వం దిశగా కానరాని పురోగతి : ఐఎల్‌ఓ
న్యూఢిల్లీ : దేశంలో మహిళా కార్మిక శక్తి ప్రాతినిధ్యం క్షీణిస్తోంది. దేశంలోని మహిళల్లో 20శాతం కన్నా తక్కువమందే వేతనాలతో కూడిన ఉద్యోగాల్లో వున్నారు. భారతదేశంలో ఉపాధికి సంబంధించి లింగ వ్యత్యాసం 50.9శాతంగా వుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) డేటా పేర్కొంది. కార్మిక శక్తిలో పురుషుల వాటా 70.1శాతంగా వుండగా, మహిళా కార్మికుల వాటా కేవలం 19.2శాతంగా మాత్రమే వుంది. గతేడాది వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ విడుదల చేసిన లింగ వ్యత్యాస నివేదిక ప్రకారం, మొత్తంగా 146 దేశాలకు గానూ భారత్‌ 135వ స్థానంలో వుంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌ వంటి చిన్న దేశాల కన్నా వెనుకబడి వుంది. చైనా, పాకిస్తాన్‌, అజర్‌బైజాన్‌, కతార్‌ వంటి దేశాలతో పాటూ ప్రతి ఐదింటిలో ఒక దేశంలో లింగ అసమానతలు ఐదు శాతం దాటి వున్నాయి. లింగ సమానత్వం దిశగా పురోగతి స్లంభించిపోయిందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యుఇఎఫ్‌) పేర్కొంది.
కోవిడ్‌ మహమ్మారి వల్ల ఈ పరిస్థితి మరింత దిగజారింది. మహిళలు ఎక్కువగా పనిచేసే రిటైల్‌, ఆతిథ్య రంగాలు కోవిడ్‌ కారణంగా దెబ్బతినడంతో ఉపాధి విషయంలో వారు మరింత ఇబ్బందులు పడ్డారు. ప్రపంచ కార్మిక శక్తిలో పూర్తి స్థాయి లింగ సమానత్వం రావాలంటే మరో 132ఏళ్ళు పడుతుందని డబ్ల్యుఇఎఫ్‌ పేర్కొంది. గత రెండు దశాబ్దాల్లో భారతదేశంలో మహిళా కార్మిక ప్రాతినిధ్యం ఆశ్చర్యకరమైన రీతిలో తగ్గింది. 2005లో 32శాతంగా వున్నది 2021నాటికి 19శాతానికి పడిపోయింది. సమాజంలో విభిన్న సామాజిక వర్గాలు, మతాలు, వివిధ వయస్సు గ్రూపులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలవ్యాప్తంగా అందరికీ ఈ పరిస్థితి వర్తించింది. మహిళలు ఉపాధికి దూరంగా వుండేందుకు దారి తీస్తున్న కారణాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా భిన్నంగా వున్నాయి. కానీ చాలా కేసుల్లో దాదాపు ఒకేలా వున్నాయని చెప్పవచ్చు. ఇందులో మొదటిది, ప్రధానంగా మహిళలు చేసే పనులకు గుర్తింపు లేకపోవడం, వాటికి ఎలాంటి జీతాలు చెల్లించకపోవడం. ఇక రెండవది, సమాజంలో వుండే నియమ నిబంధనలు, లింగ సమానత్వ అంశాలు – అంటే ఆడది ప్రధానంగా ఇంటి పనులకే పరిమితం కావాలి, ఇంట్లో పనులు చూసుకుని, పిల్లలను చక్కదిద్దుకుంటే చాలనే కన్జర్వేటివ్‌ భావజాలం ఇందుకు కారణంగా వుంది. ఇటువంటి బాధ్యతలే మహిళలను ఇంటికే కట్టిపడేసేలా చేస్తున్నాయి. ఇక మూడో కారణం వేతనాల చెల్లింపుల్లో అంతరాలు, నాల్గవది మరింత మెరుగైన రీతిలో ప్రభుత్వ చర్యలు, చట్టాలు, ఆర్థిక విధానాలు రూపొందించాల్సిన అవసరం వుంది. లింగ సమానత లోపించడం, మహిళలకు అనువైన ఉపాధి అవకాశాలు కరువవడం, వ్యవసాయంపై ఆధారపడడం, కొన్ని కుటుంబాలకు సంబంధించినంత వరకు పెరిగిన ఆర్థిక సుస్థిరత, ఉద్యోగాలు చేయడం కన్నా చదువుకే ప్రాధాన్యతనివ్వడం, భద్రతాపరమైన ఆందోళనలు వంటివి ప్రధాన కారణాలుగా వున్నాయి. మహిళలు ఉద్యోగాలు చేయకుండా నివారిస్తున్న ఈ సమస్యలను ఎలా ఎదుర్కొనాలనేది కూడా ప్రధాన సమస్యగానే వుంది. వ్యక్తిగతంగా, సమాజపరంగా, ప్రభుత్వాల స్థాయిలో అనేక మార్పులు తీసుకువస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. మహిళలు పనిచేయగల ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సి వుంటుంది.
ఒక దేశం పురోగతి సాధించాలన్నా, ఆర్థిక ప్రగతిని అందుకోవాలన్నా ఈ సవాళ్ళన్నింటినీ పరిష్కరించి, మహిళల సేవలను, వారి శ్రమను ఆర్థికంగా, సమాజపరంగా గుర్తించడం చాలా కీలకం. లింగ వ్యత్యాసాలను రూపుమాపడానికి కొన్ని వ్యూహాలను అనుసరించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ సూచించింది. సమాన విలువ గల పనికి సమాన వేతనానికి హామీ కల్పించడం, ఇందుకు చట్టపరమైన రక్షణ కల్పించడం, వేతనాల్లో పారదర్శకత, చట్టపరమైన చర్యల ద్వారా లింగ వివక్షను, వేధింపులను నిర్మూలించడం, మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేలా ప్రచారాలు నిర్వహించడం చేపట్టాలని సూచించింది. దేశంలో మహిళా ఉపాధిని మరింత పెంపొందించాలంటే మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక తోడ్పాటును అందించే చొరవలు తీసుకోవడం, మెరుగైన విద్య, శిక్షణ, భద్రతాపరమైన చర్యలు ఉపాధి అవకాశాల పెంపు, మరింత మెరుగైన పని విధానాలు, పిల్లల సంరక్షణకు తగినచర్యలు తీసుకోవాల్సి వుందని పేర్కొంది.