తగ్గుతున్న ఉద్యోగ కల్పన

న్యూఢిల్లీ : దేశంలో మే నెలలో ఉద్యోగ కల్పన తగ్గింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ ఆ తర్వాత మందగించిందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తెలిపింది. ఏప్రిల్‌లో ఈపీఎఫ్‌ కింద నమోదైన నెలవారీ నూతన చందాదారుల సంఖ్య 8,91,974 ఉండగా మే నాటికి ఒక శాతం… అంటే 8,83,176కు తగ్గిపోయింది. అయితే 18-28 సంవత్సరాల మధ్య వయసున్న యువ ఉద్యోగుల సంఖ్య మాత్రం ఇదే కాలంలో 5,75,799 (64.6%) నుండి 5,89,777 (66.8%)కి పెరిగింది. కానీ మహిళల వాటా మాత్రం 2,36,510 (26.5%) నుండి 2,21,079 (25.03%)కి తగ్గింది. దేశంలోని కొన్ని ప్రాంతాలలో మేలో రుతుపవనాలు ప్రవేశిస్తూ ఉంటాయని, దీంతో గ్రామీణ ప్రాంతాలకు వ్యవసాయ పనుల కోసం వలసలు మొదలవుతాయని, చాలా మంది నగరాలలో చిన్న చిన్న ఉద్యోగాలను విడిచి ఉపాధి కోసం పల్లెలకు పయనమవుతారని ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎఫ్‌) అధ్యక్షుడు లోహిత్‌ భాటియా చెప్పారు. అదీకాక రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులను తీసుకోవడంపై అంతగా ఆసక్తి చూపవని తెలిపారు.
ఉద్యోగాలు వదులుతున్న వారి సంఖ్య ఏప్రిల్‌తో పోలిస్తే మేలో పెరిగింది. ఏప్రిల్‌లో 1.53 మిలియన్ల మంది ఉద్యోగాలు వదిలేయగా మేలో ఆ సంఖ్య 6% అంటే 1.63 మిలియన్లకు పెరిగింది. భారత ఆర్థిక వ్యవస్థను పరిశీలించే కేంద్రం (సీఎంఐఈ) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏప్రిల్‌తో పోలిస్తే మేలో నిరుద్యోగ రేటు తగ్గింది.