వెన్నతో కమ్మగా…

మలై కుల్ఫీ
కావాల్సిన పదార్థాలు : పాలు – అరలీటరు, కండెన్స్‌డ్‌ మిల్క్‌- అరకప్పు, పాలపొడి- కప్పు, కుంకుమ పువ్వు- చెంచా, యాలకులపొడి – చెంచా, పంచదార- రుచికి తగినంత, పిస్తా పలుకులు- పావుకప్పు, జీడిపప్పు- అలంకరణకు (నేతిలో వేయించాలి).
తయారు చేసే విధానం : మందపాటి అడుగున్న గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. ఇందులో పాలు, కండెన్స్‌డ్‌ మిల్క్‌, పాలపొడి తీసుకొని మరిగించాలి. ఈ పాలు బాగా మరుగు తుండగా కుంకుమ పువ్వు, యాలకుల పొడి, తగినంత పంచదార చేర్చి బాగా కలియ తిప్పాలి. ఇప్పుడు సన్నటి మంట మీద మరిగి స్తూనే పిస్తా పలు కులు వేసి దించే యాలి. చిక్కటి పాల మిశ్రమాన్ని గుంట లోతుగా ఉన్న పాత్ర లోకి తీసుకొని ఓవెన్లో ఇరవై నిమి షాలు బేక్‌ చేయాలి. ఇలా తయారైన మలై కుల్ఫీని జీడిపప్పుతో అలంకరిస్తే సరిపోతుంది.
కృష్ణాష్టమి రోజు ఇంట్లోని చిన్న పిల్లలకు కృష్ణుడి వేషాలు వేయడం… ఉట్టి కొట్టి వేడుకలు చేసుకోవడం సర్వసాధారణం.. అయితే ఈ రోజు కృష్ణాష్టమిని పురస్కరించుకుని పిల్లలకు కృష్ణుని వేషాలంకరణతో పాటు, ఇష్టమైన వెన్న, పాలతో స్వీట్లు చేసుకుంటే ఈ వేడుక ఇంకా ఆనందమయంగా ఉంటుంది కదూ.. అందుకే వెన్న, పాలతో చేసే కొన్ని స్వీట్స్‌ ఈ వారం…
వెన్న అప్పాలు
కావాల్సిన పదార్థాలు : వరిపిండి – రెండు కప్పులు, మొక్కజొన్నపిండి – కప్పు, వెన్న – కప్పు, బెల్లం – అరకేజీ కన్నా తక్కువ, యాలకులపొడి – అరచెంచా, నూనె – వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం : ఓ పాత్రలో బెల్లం, కాసిని నీళ్లు తీసుకుని కరిగించి మరిగించాలి. పాకం వచ్చాక వరిపిండి, వెన్న, మొక్కజొన్న పిండి వేసి బాగా కలిపి యాలకుల పొడి చేర్చాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి మిశ్రమం దగ్గరగా అవుతుంది. అప్పుడు దింపేసి.. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే అప్పాల్లా వత్తుకుని కాగుతున్న నూనెలో వేయించుకోవాలి. తీపి అప్పాలు సిద్ధం.
చిరోజి
కావాల్సిన పదార్థాలు : మైదాపిండి – పావుకేజీ, పంచదార – పావుకేజీ, డాల్డా – వంద గ్రాములు, యాలకులు – రెండు, వరిపిండి – రెండు చెంచాలు, పాలు, పెరుగు – అరగ్లాసు చొప్పున, నూనె – వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం : పంచదార, యాలకులు కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. మైదాపిండిలో పాలు, పెరుగు చేర్చి చపాతీ పిండిలా కలిపి గంట నాననివ్వాలి. ఆ తరువాత కొద్దిగా పిండి తీసుకుని చపాతీలా వత్తి కొద్దిగా వరిపిండి, కరిగించిన డాల్షా చల్లాలి. దాన్ని పొడుగ్గా రోల్‌ చుట్టి చాకుతో చక్రాల్లా కోయాలి. మళ్లీ దాన్ని చిన్నసైజు పూరీలా వత్తుకుని కాగుతోన్న నూనెలో వేయించాలి. ఇలా మిగిలిన వాటినీ చేసుకోవాలి. వీటిపై పంచదారపొడి చల్లితే సరిపోతుంది.
వెన్న బర్ఫీలు
కావాల్సిన పదార్థాలు : వెన్న – పావుకేజీ, పాలపొడి – రెండు వందల గ్రాములు – మైదా పిండి – వంద గ్రాములు, యాలకులపొడి- అరచెంచా, నెయ్యి – వంద గ్రాములు, పంచదార – అరకేజీ, కొబ్బరి పొడి – మూడునాలుగు చెంచాలు.
తయారు చేసే విధానం : ఓ పాత్రలో వెన్న, మైదా, పాలపొడి, నెయ్యి తీసుకుని ముద్దలా చేసుకోవాలి. మరో పాత్రలో పంచదార కరిగించి సరిపడా నీళ్లు చేర్చి పాకం రానివ్వాలి. పాకం కొద్దిగా ముదురు అవుతుండగా ముందుగా కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమం, యాలకులపొడి, కొబ్బరి పొడి చేర్చి కలుపుకోవాలి. రెండుమూడు నిమిషాలయ్యాక నెయ్యి రాసిన పళ్లెంలోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. పైన డ్రైఫ్రూట్స్‌ అలంకరించి చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచాలి. రెండుమూడు గంటలయ్యాక పలుచని ముక్కల్లా కోసుకుంటే సరిపోతుంది.