రాగులు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇనుము, కాల్షియం, పీచు అధికంగా వుండే రాగులతో చేసుకునే వంటకాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. సాధారణంగా రాగులతో రాగి జావా, రాగి ఇడ్లీ లాంటివి చేసుకుంటూనే వుంటాం. వాటితో పాటు మరికొన్ని వెరైటీలు కూడా చేసుకుంటే తినేందుకు ఆసక్తి కూడా పెరుగుతుంది. వీటిని పెద్దలతో పాటు పిల్లలకు కూడా పెట్టవచ్చు. వారూ తినేందుకు ఆసక్తి కనబరుస్తారు. మరి అవేంటో ఓ సారి చూద్దామా…!
దోశ…
కావాల్సిన పదార్థాలు : రాగి పిండి – కప్పు, మినపప్పు – పావకప్పు కన్నా తక్కువగా, పెసరపప్పు, కందికప్పు – రెండు చెంచాల చొప్పున, జీలకర్ర – చెంచా, మిరియాలు – చెంచా, పుల్ల పెరుగు – పావుకప్పు, ఉప్పు – తగినంత, నూనె – పావు కప్పు.
తయారు చేసే విధానం : మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు కలిపి కొన్ని గంటల ముందు నానబెట్టుకుని తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో రాగి పిండితో పాటూ నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తర్వాత అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ దోశపిండిలా చేసుకోవాలి. ఈ పిండిని వేడి పెనం మీద వేసి, దోశలా కాల్చుకుంటే కరకరలాడే రాగి దోశ సిద్ధం.
రాగి, కొబ్బరితో…
కావాల్సిన పదార్థాలు : రాగిపిండి – కప్పు, బెల్లం తరుగు, వేయించిన పల్లీలు, కొబ్బరి తురుము – పావు కప్పు చొప్పున, ఉప్పు – చిటికెడు, నెయ్యి – పావుకప్పు.
తయారు చేసే విధానం : ముందుగా ఓ గిన్నెలో రాగిపిండి, ఉప్పు తీసుకుని నీళ్లు చల్లుకుంటూ తడిపొడిగా కలపాలి. తర్వాత కొబ్బరి తురుము వేసి కలపాలి. ఈ పిండిని ఆవిరి మీద పది, పదిహేను నిమిషాలు ఉడికించుకుని ఓ పళ్లెంలోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అందులో చిన్న పలుకులుగా చేసుకున్న పల్లీలు, బెల్లం తరుగు వేసి బాగా కలపాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఉండల్లా చుట్టుకుంటే సరిపోతుంది.
బూరెలు…
కావాల్సిన పదార్థాలు : రాగులు, బెల్లం తురుము – కప్పు చొప్పున, పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు, యాలకుల పొడి – చెంచా, మినప్పప్పు, కప్పు, బియ్యం – రెండు కప్పులు, నూనె – వేయించడానికి సరిపడా, నెయ్యి – రెండు చెంచాలు.
తయారు చేసే విధానం : బియ్యం, మినప్పప్పును కలిపి, రాగుల్ని విడిగా నాలుగ్గంటల ముందు నానబెట్టుకోవాలి. బియ్యం, మినప్పప్పును కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. నానబెట్టిన రాగుల్ని కడిగి, నీటిని వంపేసి తడిపోయేదాకా ఎండలో ఉంచి ఆ తర్వాత పొడి చేసుకోవాలి. బాణలిలో నెయ్యి కరిగించి రాగిపిండిని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత యాలకుల పొడి, పచ్చికొబ్బరి తురుము కలపాలి. ఓ గిన్నెలో కొద్దిగా నీరు తీసుకుని మరో పొయ్యి మీద మరిగించి బెల్లం తురుము కలపాలి. అది కరిగాక వడకట్టి రాగిపిండికి చేర్చి ఉండల్లా చేసుకోవాలి. వీటిని మినప్పప్పు మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేయాలి. బంగారు రంగులోకి వచ్చాక తీసేస్తే పోషకాల బూరెలు సిద్ధమైనట్టే.
హల్వా….
కావాల్సిన పదార్థాలు : రాగులు – ఒక కప్పు, బెల్లం – అర కప్పు, కొబ్బరి తురుము – మూడు చెంచాలు, యాలకుల పొడి – చెంచా, నెయ్యి – చెంచా, ఉప్పు – చిటికెడు.
తయారు చేసే విధానం : రాగుల్ని రెండు మూడు గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి. పైన చెప్పిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని పలుచటి బట్టలో వేసి పిండితే పాలు వస్తాయి. ఈ పాలను మందమైన వెడల్పాటి గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి మిశ్రమం కాస్త గట్టి పడేవరకు గరిటెతో తిప్పాలి. తరువాత నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. హల్వా రూపాన్ని సంతరించుకున్న తరువాత దించి నెయ్యి లేదా నూనె రాసిన పళ్లెంలో ఈ మిశ్రమాన్ని పోయాలి. ఆ తరువాత మీకు నచ్చిన ఆకారంలో కోసుకోవాలి.