ప్రమాదంలో ప్రజాస్వామ్యం

– సంక్లిష్ట స్థితిలో కార్మికోద్యమాలు
– ప్రపంచవ్యాప్తంగా పెరిగిన వైషమ్యాలు
– శ్రామిక ఐక్యతకు విఘాతం : సీఐటీయూ ఖమ్మం జిల్లా కార్యాలయ శంకుస్థాపనలో ఖమ్మం మాజీ ఎంపీ తమ్మినేని, సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర ఉద్యమాలు సంక్లిష్ట స్థితిలో ఉన్నాయని, కార్మిక ఉద్యమాలు ప్రమాదంలో పడ్డాయని ఖమ్మం మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు కార్మిక హక్కులను హరించి వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న స్థితిలో ఉన్నామన్నారు. ఖమ్మం గట్టయ్య సెంటర్‌లో నూతనంగా నిర్మించ తలపెట్టిన బీటీ రణదీవే సీఐటీయూ జిల్లా కార్యాలయం శంకుస్థాపన సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర ఉద్యమాల మనుగడ ప్రమాదకర స్థితిలో పడ్డాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంతరాలు పెరగుతున్నాయని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ క్షీణించిందని, జీవించే హక్కునూ లాగేసుకుంటున్నారని చెప్పారు. దాంతో శ్రామికవర్గ ఐక్యత ప్రమాదంలో పడిందని తెలిపారు. అనంతరం సాయిబాబు మాట్లాడుతూ.. కార్మిక వర్గం ఐక్యతకు సీఐటీయూ కేంద్ర బిందువుగా నిలుస్తుందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి కార్మిక వర్గాన్ని తిరిగి బానిసత్వంలోకి నెట్టేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా భారతదేశంలో కార్మిక వర్గం సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికవర్గ ఐక్యతని విచ్ఛిన్నం చేసే కుట్రలను కార్మికులు ఎప్పటికప్పుడూ గమనిస్తూ మరింత ఐక్య పోరాటాలు నిర్వహించాలని సూచించారు. ఖమ్మంలో సీఐటీయూ కార్యాలయం కార్మిక వర్గ ఐక్యతకు ఉపయోగపడుతుందని, కార్మికుల అందరి కార్యాలయంగా అందరి భాగస్వామ్యంతో త్వరలో ఇది ప్రారంభానికి సిద్ధం కావాలని ఆకాంక్షించారు. సంఘటిత, అసంఘటిత కార్మికుల అందరి దగ్గరికి వెళ్లి.. కలిసికట్టుగా కార్మిక శక్తితో ఈ భవనం రూపుదిద్దుకోవాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సభలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ రావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రైతు సంఘం నాయకులు నున్నా నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పి.రాజారావు, రాష్ట్ర కార్యదర్శులు ఏ.జె.రమేష్‌, బి. మధు, జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ . కోటంరాజు, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు సాంబశివరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, రైతు సంఘం జిల్లా నాయకులు బండి రమేష్‌ , సీఐటీయూ జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.