పలువురిపై కేసులు నమోదు
నవతెలంగాణ-కేశంపేట
మండల పరిధిలోని చౌలపల్లి గ్రామ శివారులో గల వాగులో అక్రమంగా ఏర్పాటుచేసిన ఇసుక ఫిల్టర్లపై శుక్రవారం రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. తహసీల్దార్ ఆజంఅలి ఆదేశాల మేరకు ఆర్‌ఐ నివేదిత రెవెన్యూ సిబ్బందితో కలిసి వాగులో సోదాలు నిర్వహించారు. గుర్తించిన ఐదు ఇసుక ఫిల్టర్లను జెసిపి సహాయంతో ధ్వంసం చేయించారు. వాగు ప్రవాహానికి ఆటంకం కల్పించే విధంగా అడ్డంగా ఏర్పాటు చేసిన కట్టలను తొలగించారు. చౌలపల్లి గ్రామానికి చెందినవారు, తలకొండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన ఇసుక వ్యాపారులు వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్టు ఆర్‌ఐ తెలిపారు. ఇసుక ఫిల్టర్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ ఆజం అలీ తెలిపారు.