ధృతరాష్ట్ర పాలన

ధృతరాష్ట్ర పాలనలో
హింస వెయ్యి కాళ్లతో నడుస్తోంది.
ఒకానొక బుల్డోజర్‌ వ్యవస్థ
జాతుల మధ్య వైరాన్ని
పెంచి పోషిస్తుంది.
కొండమీదికి లోయల
దురాక్రమణ ఒకటి
మతోన్మాదమై జ్వలిస్తోంది.
రాజ్యం పీడకుల పక్షం వహిస్తోంది.
మణిపూర్‌ ఒక రావణ కాష్టమై
రగులుతోంది.
దుశ్శాసన సర్పమేదో
పడగ విప్పి కాటేస్తోంది.
వివక్ష, అణచివేతల వీధిలో
భరతమాత నగంగా
ఊరేగుతోంది.
దేశం ఒక సామూహిక
అత్యాచారాలకు
ఒక సామాజిక హత్యా రాజకీయాలకు
గొడుగు పడుతోంది.
కుల మతాల విష కంఠంలో
విద్వేషం – విధ్వంసం
ఊపిరి పోసుకున్న చోట
మనుషులు సమాధి కాబడటం
చరిత్రకు మలుపు!?
దేశం స్మశానం కావడం
స్వేచ్చా – స్వాతంత్య్రాల గెలుపు !?
నాగరికత అంటే
ఇప్పుడీ భరతఖండంలో
ఆకాశములో సగాన్ని
భూమ్మీద బట్టలూడదీసి ఊరేగించడమే!?
మగాళ్లు మగాలై
రక్త మాంసాలను రుచి మరగడమే!?
ఓ ప్రభూ !
వీళ్ళు ఏమి చేయుచున్నారు
వీరికి బాగా తెలుసు.
మీరు మత ప్రతినిధిగా
వర్ధిల్లినంతకాలం
పీడితులు మరింత పీడితులే
అవుతారన్నది ముమ్మాటికీ సత్యం!?
దేశం ఎప్పుడూ సిగ్గు పడదు.
అసలు సిగ్గు పడడానికి
ఏముంది ఇక్కడీ
ఇది మతం పండిన నేల.
హింస కురుస్తూనే ఉంటుంది.
ఇది కులం విచ్చుకత్తులతో
నిండిన నేల.
రక్తపుటేరులు ప్రవహిస్తూనే ఉంటాయి.
ధతరాష్ట్ర పాలనలో
ప్రజలెప్పుడూ అంధులే!
చెడు వినరు – చెడు కనరు
చెడు తప్ప మరేమీ చేయరు!?
మానవత్వమంటే రాక్షసత్వమేనని
వాడెవడో కాషాయి
క్రీస్తుకు బోధిస్తున్నాడు!
శాంతి అంటే
అత్యంత జుగుప్సాకర హింసే అని
ఒకానొక మతోన్మాది
బుద్ధునికి ప్రవచిస్తున్నాడు!
రాజ్యాంగానికి ముసుగు వేసి
నియంతల పాలనకు తెరదీయడమే
ప్రజాస్వామ్యమని
తామరపూలు కలలు కంటున్నాయి!
ఇది యుద్ధం పండిన నేల
దుఃఖం కురుస్తూనే ఉంటుంది!?
నగ రుతువుల కాలం ఒకటి
పెను తుఫానై చుట్టుకుంటున్నది.
మతమొక అత్యాచార కేంద్రమై
హత్యా రాజకీయాల నిలయమై
దేశం పట్టపగలు నడివీధిలో
నగంగా ఊరేగింప బడుతున్నది!?
ద్రౌపది వస్త్రాపహరణమే
ఈ దేశ చిరునామా అవుతున్నది!?
కుల, మతాల సునామీలో
కొట్టుకుపోవడమే
మనిషి ఆనవాలవుతున్నది!?
ఇది యుద్ధం కురిసిన నేల
ముఖం పండుతూనే ఉంటుంది !?
– శిఖాఆకాశ్‌