చాలీచాలని వేతనాలతో అవస్థలు

– 15 రోజులుగా సమ్మె చేస్తున్నా స్పందించని ప్రభుత్వం
– మండల వ్యాప్తంగా 220 వేల మంది కార్మికులు
– గొడ్డుచాకిరి చేస్తున్న పంచాయతీ సిబ్బంది
– న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాటం
– 11వ పీఆర్సీ ప్రకారం వేతనం అమలు చేయాలి
– కారోబార్లను సహాయ కార్యదర్శులుగా గుర్తించాలి
– జీవో 60 ప్రకారం స్వీపర్లకు
– రూ.15,600 ఇవ్వాలి
నవతెలంగాణ-యాచారం
గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేపట్టారు.15 రోజులుగా సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తుంది. సమ్మెకు దిగిన కార్మికులను అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలూ వినిపిస్తున్నాయి. దీంతో యాచారం మండలం వ్యాప్తంగా 24 గ్రామ పంచాయతీల్లో 220 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరు గ్రామంలో డ్రయినేజీ, తాగునీటీ సరఫరా, విద్యుత్‌ వీధిదీపాలు ఏర్పాటు, ఇంటి పన్నులు ఇతర పనుల్లో నిరంతరం పనులు చేస్తుంటారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో పనులు నిర్వహించి గ్రామ పరిశుభ్రతలో కీలకపాత్ర పోషిస్తారు. వారు కరోనా నేపథ్యంలో కూడా ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహించారు. కానీ ప్రభుత్వం వారి పనిని గుర్తించకుండా పనికి తగిన వేతనాలు అమలు చేయడంలో విఫలమైందని పలు వురు విమర్శిస్తున్నారు. పాలకవర్గం, అధికారులు వారిపై పెత్తనం చెలాయిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అంతేక ాకుండా చేసిన పనికి సరైన సమయంలో వేతనాలు ఇవ్వకుండా కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. అసలే చాలిచాలనీ వేతనాలు ఆ వచ్చే డబ్బులు కూడా సకాలంలో రాకపోతే కుటుంబాన్ని పోషించేంది ఎట్లా అని కార్మికులు దిగులు చెందుతున్నారు. పంచాయతీలో పారిశుధ్య కార్మికులు, వాటర్‌మెన్‌, ఎలక్ట్రీషియన్‌, కారోబార్లుగా తామంతా గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. అయినా కూడా ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించడంలో విఫలమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 11వ పిఆర్సీ కింద మినిమం బేసిక్‌ వేతనం రూ.19 వేలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు జీవో నెంబర్స్‌ 51ని సవరించి మల్టీ పర్పస్‌ వర్కర్‌ విధానాన్ని రద్దు చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్‌ఐ, పీిఎఫ్‌, రూ. 10 లక్షల ప్రమాద బీమా, కనీస వేతనం వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పాలకవర్గం వేధింపులు ఆపాలి
కారోబార్లుగా గ్రామపంచాయతీలో కొన్నేండ్లుగా రికార్డు మెయింటెనెన్స్‌ చేస్తూ ఇతర పనులు చేస్తున్నాం. పంచాయతీ నుంచి వచ్చే రూ.8 వేలు సరి పోవడం లేదు. గ్రామంలో సర్పంచ్‌, కార్యదర్శి చెప్పిన ప్రతీ పని చేస్తాం. అయినా బెదిరింపులు తప్పడం లేదు. ప్రభుత్వం వెంటనే మమ్మల్ని సహాయ కార్యదర్శులుగా గుర్తించాలి. 11వ పీఆర్సీ ప్రకారం రూ.19 వేలు వేతనం అమలు చేయాలి. లేనియేడల ఎంతటి త్యాగనికైనా సిద్ధపడతాం.
ఆలంపల్లి జగన్‌ కరోబార్‌ మల్కీ జ్‌గూడ

సమ్మెతో పడకేసిన పారిశుధ్యం
గత 15 రోజులుగా పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెతో గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్త్తె దర్శనమిస్తుంది. ఇంటింటికీ తాగునీరందక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. డ్రయినేజీ ముగురు క్లీనింగ్‌ లేకపోవడంతో దుర్వాస వెదజల్లుతోంది. పాలకవర్గాలు చేసేదేమీ లేక చేతులెత్తేస్తున్నారు. సమ్మె చేస్తున్న కార్మికుల పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడం మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నారు. గ్రామాలలో స్థానిక ప్రజలు పంచాయతీ వర్కర్ల సమ్మెపై వెంటనే స్పందించి విరమింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఆరోగ్యాలు లెక్క చేయకుండా పనులు చేస్తున్నాం
ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో విధులు నిర్వహిస్తాం. గ్రామంలో చెత్తను సేకరించి, డ్రయినేజీని ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తాం. గ్రామపంచాయతీ అధికారులు ఎక్కడ పని చేయాలని ఆదేశించినా అక్కడ పనులు చేస్తాం. తమ ఆరోగ్యాలు లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నాం. కానీ ప్రభుత్వాధికారులు తమకు వేతనాలు పెంచాలని కోరినా పట్టించుకోరు. కనీస వేతనాలు ఇవ్వకుంటే, కుటుంబాలను ఎలా పోషించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి
కొంగర మైసమ్మ పంచాయతీ కార్మికురాలు, యాచారం

సమ్మెపై స్పందించకపోవడం దుర్మార్గం
రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులుగా పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం స్పందించక పోవడం దుర్మార్గం. కార్మికుల సమస్యలపై ఎన్నో ఏండ్లుగా ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసినా స్పందన కరువు. కార్మికులందరూ కలిసి రాస్తారోకో కూడా చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు పనికి తగిన వేతనం అమలు చేయకుండా పాలకవర్గాలు వారి సంక్షేమాన్ని విస్మరి స్తున్నాయి. ప్రభుత్వానికి కార్మికుల సమ్మెపై చీమకుట్టినట్లు కూడా లేదు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తాం.
సీఐటీయూ మండల కన్వీనర్‌ ఎస్‌.చందునాయక్‌