దివ్యాంగుల సమాచారం అవసరం లేదు

కుటుంబ ఆరోగ్య సర్వేపై కేంద్రం
న్యూఢిల్లీ: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌- 6) నుండి అంగవైకల్యానికి సంబంధించిన ప్రశ్నలను తొలగించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్ధించుకుంది. అలాంటి సమాచారంలో వేగవంతమైన మార్పులు రావని, అందువల్ల దానిని సేకరించాల్సిన అవసరం లేదని తెలిపింది. తల్లులు, పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడంపై మాత్రమే దృష్టి సారించామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (గణాంకాల విభాగం) వివరించింది. అందువల్ల వైకల్యంపై కచ్చితమైన సమాచారాన్ని సేకరించడం సాధ్యం కాదని తేల్చేసింది. వైకల్యానికి సంబంధించి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ఓలు సేకరించే సమాచారంలో తేడాలు ఉంటాయని, కాబట్టి జాతీయ స్థాయిలో వైకల్యానికి సంబంధించి వివరాలు తీసుకోవడం కష్టమని చెప్పింది. అదీకాక దివ్యాంగుల సంఖ్యను తక్కువగా అంచనా వేసే ప్రమాదం కూడా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019-2021 మధ్యకాలంలో జరిపిన కుటుంబ సర్వే-5లో వైకల్యంపై కూడా ప్రశ్నలను చేర్చారు. ఈ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో 1%, పట్టణ ప్రాంతాలలో 0.9% దివ్యాంగులు ఉన్నారు. అయితే 2018లో ఎన్‌ఎస్‌ఎస్‌ఓ జరిపిన సర్వేలో గ్రామీణ ప్రాంతాలలో 2.3%, పట్టణ ప్రాంతాలలో 2% దివ్యాంగులు ఉన్నారని తేలింది. ఎన్‌ఎస్‌ఎస్‌ 76వ రౌండ్‌లోనే దేశంలోని దివ్యాంగులకు సంబంధించిన సమాచారం చాలా వరకూ అందుబాటులోకి వచ్చిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. కాగా సమాజంలోని దివ్యాంగులను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోదని, సర్వేలో వారిపై ప్రశ్నలు చేర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ప్రధాన కార్యదర్శి మురళీధరన్‌ విమర్శించారు.