ఆర్టీసీ విలీన బుక్‌లెట్‌ ఆవిష్కరణ

Discovery of RTC merger bookletనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీన ప్రక్రియకు సంబంధించిన బుక్‌లెట్‌ను టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) అధ్యక్షులు వీరాంజనేయులు శనివారం బస్‌భవన్‌ వద్ద ఆవిష్కరించారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అనుభవాలు, స్టాఫ్‌ అండ్‌వర్కర్స్‌ ఫెడరేషన్‌ అధ్యయన కమిటీ నివేదిక, ప్రతిపాదిత అంశాలను ఈ బుక్‌లెట్‌లో పొందుపర్చారు. ఆర్టీసీలో ప్రస్తుత పరిస్థితి, విలీనానికి ముందు పరిష్కరించాల్సిన అంశాలు, ఉద్యోగ భద్రత, వైద్య సదుపాయాలు, బ్రెడ్‌ విన్నర్స్‌ స్కీం , కార్మిక సంఘాలను అనుమతించటం, సీపీఎస్‌, పీఎఫ్‌, ఎస్‌బీటీ, ఎస్‌ఆర్‌బీఎస్‌ బకాయిల చెల్లింపు సమస్యలపై ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ, ప్రభుత్వ విలీన కమిటీ, ఇతర అధికారులకు ఇచ్చిన వినతి పత్రాలను ఈ బుక్‌లెట్‌లో ప్రచురించారు. దీన్ని కార్మికుల్లోకి విస్త్రుతంగా తీసుకెళ్లి ప్రచారం చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఖమ్మం రీజియన్‌లో కూడా బుక్‌లెట్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగిందనీ, అక్కడ ఎస్‌డబ్ల్యూఎఫ్‌్‌ పూర్వ అధ్యక్షులు ఎంఎన్‌ రెడ్డి దీన్ని ఆవిష్కరించారని తెలిపారు. బస్‌భవన్‌ వద్ద జరిగిన బుక్‌లెట్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌ రెడ్డి, కోశాధికారి కే గంగాధర్‌, కార్యదర్శులు జీఆర్‌ రెడ్డి, చంద్రప్రకాష్‌, సీనియర్‌ నాయకులు వీ రాములు తదితరులు పాల్గొన్నారు.