స్వాతంత్య్ర సమరయోధులపైనా వివక్షే

Discrimination against freedom fighters– ‘ఆఖరి యోధులు’ పుస్తకావిష్కరణలో పాలగుమ్మి సాయినాథ్‌
– వారి త్యాగాలు ప్రజలకు తెలియాలి
– కార్పొరేట్‌ మీడియా వాస్తవాలు దాచేస్తోంది : ‘ఆఖరి యోధులు’ పుస్తకావిష్కరణలో పాలగుమ్మి సాయినాథ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్వాతంత్య్ర సమరయోధులపైనా చరిత్ర వివక్షనే ప్రదర్శించిందని మెగసెసే అవార్డు గ్రహీత, ప్రముఖ జర్నలిస్ట్‌ పాలగుమ్మి సాయినాథ్‌ అభిప్రాయపడ్డారు. గ్రామ, తండా, పట్టణ స్థాయిల్లో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా స్థానిక పోరాటాలు చేసిన యోధుల జీవిత చరిత్రల్ని ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా లేవన్నారు. పాలగుమ్మి సాయినాథ్‌ ఆంగ్లంలో ‘లాస్ట్‌ హీరోస్‌’ శీర్షికతో రాసిన పుస్తకాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ ‘ఆఖరి యోధులు’ పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురించిన ఈ పుస్తకాన్ని సోమవారంనాడిక్కడి సుందరయ్య విజ్జాన కేంద్రంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆవిష్కరించి, తొలి ప్రతిని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మికి అందచేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పాలగుమ్మి సాయినాథ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండేండ్ల క్రితం ఆజాదీ కా అమృత్‌ మహౌత్సవ్‌ పేరుతో రూ.110 కోట్లను కేటాయించిందని తెలిపారు. అదే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసిందనీ, దానిలో స్వాతంత్య్ర పోరాట యోధుల కథలు, ఫోటోలు, ఫీచర్లు వంటివి ఏవీ లేవన్నారు. కేవలం ఆ వెబ్‌సైట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ విభిన్న వేషాల్లో ఉన్న ఫోటోలు మాత్రమే ఉన్నాయని ఆక్షేపించారు. ప్రస్తుతం బ్రతికున్న స్వాతంత్య్ర పోరాట యోధుల ఫోటోలు సైతం ఆ వెబ్‌సైట్‌లో లేకపోవడం దురదృష్టకరమన్నారు. మరో ఐదేండ్లు దాటితే ఆనాటి యోధులు ఎవరూ బ్రతికుండే అవకాశం కూడా లేదన్నారు. స్వాతంత్య్ర పోరాటం అనగానే గాంధీ, నెహ్రూ, పటేల్‌, భగత్‌సింగ్‌ వంటి కొందరి పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపిస్తున్నాయనీ, ఇప్పుడు ఆ చరిత్రల్ని కూడా మరుగున పడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రపోరాటం అసలు దేనికోసం జరిగిందనే మౌలిక ప్రశ్నతో కూడిన త్యాగాల వివరాలేవీ పాఠ్యాంశాల్లో లేవని విశ్లేషించారు. బ్రిటీష్‌ పాలనను ప్రజలు ఎందుకు వ్యతిరేకించారో భవిష్యత్‌ తరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఆ విషయాల్ని ప్రజా బాహుళ్యంలో ప్రచారం చేయాల్సిన మీడియా కార్పొరేట్‌ గుప్పిట్లోకి వెళ్లిపోయిందనీ, అదానీ, అంబానీలు వాటిని స్వాధీనం చేసుకుని, ‘విశ్వగురు’ ఏది చెప్తే అదే నిజమని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కెప్టెన్‌ భావ్‌, మల్లు స్వరాజ్యం, ఎన్‌ శంకరయ్య వంటి అనేకమంది సమరయోధులు క్షేత్రస్థాయిలో రైతులు, కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పోరాటాలు చేస్తూ, నాయకుల్ని తయారు చేశారని చెప్పారు.
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులు అందర్నీ ఒకేరకంగా గుర్తించట్లేదని అన్నారు. ప్రజా సమరయోధుల్ని ప్రజలే గుర్తుంచుకొని, కాపాడుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఆవిర్భవించిన చిన్న ఉద్యమాలే ఆ తర్వాత మహౌద్యమాలుగా నిర్మాణమయ్యాయని ఉదహరించారు. భిన్న రూపాల్లో పోరాటాలు జరిగినా బ్రిటీష్‌ వలసవాద పాలన వారందర్నీ ఏకం చేసిందని విశ్లేషించారు. ఇప్పుడూ ప్రతి గ్రామంలోనూ కులవివక్ష, ఆత్మగౌరవం, గృహహింస, దురహంకారానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలు కనిపిస్తాయనీ, వాటన్నింటినీ సమ్మిళితం చేస్తూ మహౌద్యమాల నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. కేంద్రంలోని పాలకులు, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ుపరివార్‌ శక్తులు జాతీయోద్యమాన్ని వక్రీకరిస్తున్నాయనీ, గాంధీ, నెహ్రూల పాత్రే లేదని వాదించేవారు ఇక సామాన్య ప్రజల పాత్రను ఎలా అంగీకరించే పరిస్థితలు లేవనీ, పైగా సావర్కార్‌ వంటి లొంగుబాటుదారుడి పాత్రను గొప్పగా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. చరిత్రను తిరగరాయడం సాధ్యం కాక, అసలు చరిత్రనే చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ప్రజాపోరాటాల చరిత్రల్ని కాపాడుకుంటూ, భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉన్నదని అన్నారు. అనువాదకులు ఎస్‌ వినయకుమార్‌ ‘ఆఖరి యోధులు’ పుస్తక పరిచయం చేశారు. నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ సంపాదకులు కే ఆనందాచారి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ ఆర్‌ వాసు ఆహూతుల్ని ఆహ్వానించారు. మేనేజర్‌ డీ కృష్ణారెడ్డి వందన సమర్పణ చేశారు.