ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌ పిటిషన్‌ కొట్టివేత

MLA Gyadari Dismissal of Kishore's petitionనవతెలంగాణ – హైదరాబాద్‌
తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌ ఎన్నికను సవాల్‌ చేయాలన్న ఎలక్షన్‌ పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ లక్ష్మణ్‌ విచారించారు. తన ఎన్నికను సవాల్‌ చేసిన అద్దంకి దయాకర్‌ వేసిన పిటిషన్‌ను కొట్టేయాలన్న ఎమ్మెల్యే మధ్యంతర పిటిషన్‌ను కొట్టేశారు. 2018లో తుంగతుర్తి నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కిషోర్‌ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి అద్దంకి దయాకర్‌ దాఖలు చేసిన ఎలక్షన్‌ పిటిషన్‌ను కొట్టేసేందుకు నిరాకరించారు. ఎలక్షన్‌ పిటిషన్‌పై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.
స్టే కొనసాగింపు
వెలమ, కమ్మ సంఘాల భూమి కేసులో హైకోర్టు
హైదరాబాద్‌ నగరంలోని శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో వెలమ, కమ్మ కుల సంఘాల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం ఐదెకరాల చొప్పున ఇవ్వడాన్ని సవాల్‌ చేసిన పిల్‌ను సోమవారం హైకోర్టు విచారించింది. కేటాయించిన భూములకు మార్కెట్‌లో ఉన్న విలువ ఎంతో తేల్చేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. 2012లోని జీవోనెంబర్‌ 571 మేరకు ప్రభుత్వం ఆ భూములకు మార్కెట్‌ విలువను నిర్ణయిస్తామన్న వినతిని ఆమోదిస్తూ చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే, జస్టిస్‌ టి వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో భూమి కేటాయింపునకు వెలువడిన జీవోనెంబర్‌ 47ను సవాల్‌ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్‌ వినాయక్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌లో హైకోర్టు ఇదివరకు ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొనసాగించింది. ఆ భూముల్లో నిర్మాణాలు చేయొద్దని ఆదేశించింది. ఆ భూమి తమదేనంటూ ప్రైవేట్‌ వ్యక్తులు వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. సంబంధిత సివిల్‌ కోర్టులో భూమిపై హక్కుల గురించి న్యాయపోరాటం చేసుకోవాలని సూచించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేలులో ఎకరం ఒక్క రూపాయి చొప్పున ఐదెకరాలను రాజా బహద్దూర్‌ వెంకట్‌రామిరెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీకి భూమి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన పిల్‌ను కూడా బెంచ్‌ విచారించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎకరం ఒక్క రూపాయికి ఇస్తూ 2018లో వెలువడిన జీవోనెంబర్‌ 105ను కొట్టేయాలని కోరుతూ సికింద్రాబాద్‌కు చెందిన కోటేశ్వర్‌రావు వేసిన పిల్‌పై విచారణను వాయిదా వేసింది.
నిందితులపై తీసుకున్న చర్యలేంటీ? : హైకోర్టు
వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ధరావత్‌ ప్రీతి ఎండీ అనస్థీషియా విద్యార్థిని అనుమానస్పద మృతి ఘటన తర్వాత పోలీసులు నిందితులపై తీసుకున్న చర్యలేంటో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌ పెట్టామనీ, కేసు నమోదు చేశామంటూ చెబితే సరిపోదనీ, నిందితులపై తీసుకున్న చర్యలేంటో వివరంగా చెప్పాలని ఉత్తర్వులు జారీ చేసింది. రెండో ఏడాది చదువుతున్న సైఫ్‌ ర్యాగింగ్‌ చేసి వేధింపులకు పాల్పడటం వల్ల మణించిందంటూ ఆరోపిస్తూ తెలంగాణ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లయ్య రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. దీనిని చీఫ్‌జస్టిస్‌ అలోక్‌ అరధే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారించింది. ర్యాగింగ్‌ ఘటన తర్వాత ఇతర కాలేజీల్లో ర్యాగింగ్‌ చర్యల నివారణకు తీసుకున్న చర్యల గురించి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. సైఫ్‌ అనే మెడికో వేధింపుల వల్లే ప్రీతి చనిపోయిందంటూ మల్లయ్య లేఖ రాశారు.