జెడ్పీ చైర్మెన్‌పై అసమ్మతి గళం

– సమావేశానికి హాజరుకాకుండా ఓ హోటల్‌లో జట్పీటీసీల మీటింగ్‌
నవతెలంగాణ-నిజామాబాద్‌ సిటీ
నిజామాబాద్‌ జిల్లా జడ్పీ చైర్మెన్‌ దాదన్నగారి విఠల్‌రావుపై జడ్పీటీసీలు అసమ్మతి గళం వినిపించారు. మంగళవారం నిర్వహించిన జడ్పీ సమావేశానికి హాజరుకాకుండా.. నగరంలోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. నిధులు విడుదల, కేటాయింపులో జడ్పీటీసీలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన 24 మంది జడ్పీటీసీలు సమావేశానికి రాలేదు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి ఒక్కొక్క జడ్పీటీసీ మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. దాంతో కోరం లేక సమావేశం వాయిదా వేస్తున్నట్టు చైర్మెన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీలు మాట్లాడుతూ.. చైర్మెన్‌ తమను పట్టించుకోవడం లేదని, అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కనీసం మంత్రులను కలవడానికి కూడా తీసుకెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు తమకున్న పరిచయంతో కనీసం తమ మండలంలో ఎటువంటి అభివృద్ధి లేదని తమను ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్సీ కవితను కలవడంతో 14 మంది సభ్యులకు రూ.10 లక్షల చొప్పున నిధులను సీడీసీ నుంచి మంజూరు చేయించారని తెలిపారు. జడ్పీ చైర్మెన్‌ హౌదా పైనే విసుగుచెందామని, ఎన్ని సార్లు చెప్పినా మండలంలో జరిగే సమస్యలను, అధికారులతో పర్యవేక్షణ చేసిన దాఖలాలు లేవన్నారు. గత సమావేశంలో లేవనెత్తిన సమస్యలను వచ్చే మీటింగ్‌లో ఆ పనులు ఎంతవరకు పూర్తి చేశారు, ఎంత వరకు వచ్చింది అనే అంశాలను ఏ ఒక్క సమావేశంలోనూ జెడ్పీ చైర్మెన్‌ అధికారులను అడిగిన దాఖలాలు లేవని ఆరోపిస్తున్నారు. తాము అభివృద్ధి పనులు చేపట్టకుంటే గ్రామాల్లో ఎలా తిరగాలని ప్రశ్నిస్తున్నారు. కనీసం జడ్పీ చైర్మెన్‌ ఫండ్‌ నుంచైనా నిధులు మంజూరు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కాగా, నేడు నగరంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన ఉండగా.. దానికి కొన్ని గంటల ముందే ఇలాంటి పరిణామం చేసుకోవడం గమనార్హం.