పాఠశాలకు మైక్ సెట్ వితరణ

నవతెలంగాణ- పెద్దవంగర: మండల పరిధిలోని బొమ్మకల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలకు గురువారం రోటరీ క్లబ్ వరంగల్ వారి ఆర్థిక సహకారంతో మైక్ సెట్, విద్యార్థులకు టై, బెల్ట్, బ్యాడ్జీలను వితరణ చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండీ రహమాన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రోటరి క్లబ్ వరంగల్  అధ్యక్షుడు మామిడాల రమేష్ బాబు, ఉపాధ్యక్షుడు అనంతుల కుమారస్వామి మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా 200 పైగా దేశాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండి ఇతరులకు సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని అన్నారు. పట్టుదల, క్రమశిక్షణతో చదివి విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయిని అధిరోహించాలని ఆకాంక్షించారు. దాతల సహాయం కోసం కృషి చేసిన ఉపాధ్యాయుడు భాస్కర్, రోటరీ క్లబ్ ప్రతినిధులను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణ, సురేష్, రమేష్ బాబు, భాస్కర్, అమర్, విద్యార్థులు పాల్గొన్నారు.