సంక్షేమ బోర్డు నిధులు దారిమళ్లించడం దారుణం

– కార్మికులకు మోటార్‌ సైకిళ్ళు పంపిణీ చేయాలి
– సీఐటీయు నాయకులు అర్జున్‌, నరసింహారావు
– కలెక్టర్‌ కార్యాలయం ఎదుట భారీ ధర్నా
– అధికారులకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-పాల్వంచ
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు ప్రభుత్వం దారిమళ్లించడం దారుణమని బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు తల నరసింహారావు, సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్‌ ఉన్నారు. తెలంగాణ భవన నిర్మాణ కార్మికులకు మే డే సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం మోటార్‌ సైకిళ్లను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటియు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. భవన కార్మికుల భారీ నినాదంతో ప్రాంతమంతా మారుమోగిపోయింది. అనంతరం సమ్మదిగా అధికారులకు వినతిపత్రం అందజేశారు. సీఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దొడ్డ రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం మోటార్‌ సైకిల్‌ ఇస్తామని వాగ్దానం చేసి సంవత్సరం గడిచిపోయి రెండో సంవత్సరం వచ్చిందని అయినప్పటికీ ఒక్క కార్మికుడికి కూడా మోటార్‌ సైకిల్‌ పంపిణీ చేయలేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులన్నింటిని ప్రభుత్వం దారిమళ్లించి అడ్డగోలుగా ఖర్చు పెడుతుందని విమర్శించారు. సంక్షేమ బోర్డులోని నిధులన్ని భవన నిర్మాణ కార్మికుల కోసం మాత్రమే ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం తెచ్చిన లేబర్‌ కోడ్లు అమలు అయితే 1996 కేంద్ర నిర్మాణ రంగ కార్మికుల చట్టం నీరుగారి పోతుందని పేర్కొన్నారు. 1996 నిర్మాణరంగ కార్మికుల చట్టం ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటయిందని ఇప్పుడు అసలు చట్టాన్ని రద్దు చేయడం ద్వారా వెల్ఫేర్‌ బోర్డును కూడా నీరుగార్చి రద్దు చేసే ప్రమాదం ఉందని సిఐటియు నేతలు పేర్కొన్నారు. నిర్మాణరంగ కార్మికుల పిల్లలకు సంక్షేమ బోర్డు ద్వారా విద్యా రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై పోరాడుతామని పేర్కొన్నారు. ధర్నా వద్దకు కార్మిక శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కమిషనర్‌ షర్ఫుద్దీన్‌ హాజరై వినతి పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్ఫేర్‌ బోర్డులో పెండింగ్‌ క్లెయిమ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మోటార్‌ సైకిల్‌ పంపిణీ విషయం గురించి రాష్ట్ర స్థాయి నుంచి ఎటువంటి నియమ నిబంధనలు రాలేదని పై అధికారులు సంప్రదించి త్వరితగతన జిల్లాలో పథకం అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని. ఇతర సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటియు నాయకులు గుర్రం రాములు, కిషోర్‌ నాగరాజు, మద్దిరాల వాణి, సత్యనారాయణ, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.