ఆర్టీఐ చట్టంలో మార్పులొద్దు

– డేటా ప్రొటెక్షన్‌ బిల్లుకు సిద్ధమవుతున్న కేంద్రం
– నిపుణులు, విశ్లేషకుల ఆందోళన
న్యూఢిల్లీ : డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ (డీపీడీపీ) బిల్లుకు కేంద్రం సిద్ధమవుతున్నది. ఈ బిల్లు ఆమోదం కోసం రాబోయే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టడానికి తయారవుతున్నది. దీంతో ఈ బిల్లు విషయంలో పలు అనుమానాలు, ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టాన్ని నీరుగార్చే యత్నం చేస్తున్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది.
గతేడాది నవంబర్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖచే సంప్రదింపుల కోసం పంపిణీ చేయబడిన బిల్లు ముసాయిదా సమస్యలతో నిండి ఉన్నది. అప్పట్లో ఈ బిల్లులోని లోపాలపై సామాజిక కార్యకర్తలు పెదవి విరిచారు. గోప్యత హక్కు కోసం ప్రచారం చేసే వారి ద్వారా ఈ బిల్లు విమర్శలకు కేంద్ర బిందువైంది. చివరకు బిల్లు క్యాబినెట్‌ ఆమోదం పొందింది. కానీ ఈ బిల్లు పబ్లిక్‌ డొమైన్‌లో లేకపోవటం గమనార్హం. అయితే, డేటా రక్షణ చట్టం మునుపటి ముసాయిదాలో ఉన్న లోపాలతో కూడినట్టుగా ఉండకూడదని నిపుణులు, విశ్లేషకులు తెలిపారు.
2005లో చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి లక్షలాది మంది భారతీయ పౌరులకు సాధికారత కల్పించిన సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టంలోని నిబంధనలను పలుచన చేయకూడదని సూచించారు. ప్రజాస్వామ్యంలో తమ ప్రభుత్వాలను సమర్థవంతంగా జవాబుదారీగా ఉంచడానికి, వ్యక్తులు వివిధ వర్గాల వ్యక్తిగత డేటాతో సహా సమాచారాన్ని పొందాలని తెలిపారు.
ఉదాహరణకు, ఉద్దేశపూర్వక ఎగవేతదారుల పేర్లు, ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) వివరాలను తెలుసుకునే హక్కు పౌరులకు ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
భారతదేశంలో ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించిన అనుభవం, ప్రజలు, ముఖ్యంగా పేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను పొందాలనే ఆశ ఉంటే, వారు సంబంధిత, గ్రాన్యులర్‌ సమాచారాన్ని పొందగలగాలని తెలిపారు.
ఉదాహరణకు, పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ (పీడీఎస్‌) కంట్రోల్‌ ఆర్డర్‌ పీడీఎస్‌ యొక్క పబ్లిక్‌ స్క్రూటినీ, సోషల్‌ ఆడిట్‌లను ప్రారంభించడానికి రేషన్‌ కార్డ్‌ హౌల్డర్ల వివరాలను, రేషన్‌ షాపుల రికార్డులను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచవలసిన అవసరాన్ని గుర్తిస్తుంది. అటువంటి పబ్లిక్‌గా యాక్సెస్‌ చేయగల వ్యక్తిగత డేటా లేనప్పుడు, ఉద్దేశించిన లబ్ధిదారులు వారి ఆహార ధాన్యాల హక్కును పొందగలగటం అసాధ్యమని వివరించారు.
2022 డేటా ప్రొటెక్షన్‌ బిల్లు దాని పరిధిని విస్తరించడానికి సెక్షన్‌ 8(1)(జే) ఆర్టీఐ చట్టం పరిధి నుంచి మొత్తం వ్యక్తిగత సమాచారాన్ని మినహాయించే నిబంధనను కలిగి ఉంది. ఇది దేశంలోని పారదర్శక పాలనకు పెద్ద దెబ్బే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాచార రక్షణ బిల్లు తప్పనిసరిగా ఆర్టీఐ చట్టంలోని నిబంధనలు, లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలన్నారు. గోప్యత హక్కును గుర్తించడం లేదా డేటా రక్షణ చట్టాన్ని అమలు చేయడం కోసం ప్రస్తుత ఆర్టీఐ చట్టానికి ఎలాంటి సవరణ అవసరం లేదని తెలిపారు.
ఇక ప్రభుత్వం అతిపెద్ద డేటా రిపోజిటరీ అయినందున, చట్టం కార్యనిర్వాహక వర్గానికి విస్తత విచక్షణాధికారాలను ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలచే చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు చర్య తీసుకోవడానికి చట్టం కింద ఏర్పాటు చేయబడిన పర్యవేక్షణ సంస్థ తగినంత స్వతంత్రంగా ఉండటం అత్యవసరమని తెలిపారు. బాధిత వ్యక్తులు పర్యవేక్షక సంస్థను సంప్రదించడానికి చట్టం అందుబాటులో ఉండే, ప్రజలకు అనుకూలమైన ఫిర్యాదుల పరిష్కారాన్ని అందించాలన్నారు. చివరగా, డేటా ఉల్లంఘన విషయంలో, బాధితుడు తప్పనిసరిగా ద్రవ్య పరిహారం పొందగలగాలని నిపుణులు తెలిపారు. డేటా ప్రొటెక్షన్‌ బిల్లులో ఏ రూపంలోనైనా పరిహారం పొందే అవకాశం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.