– ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చర్చావేదికలో పలువురు వ్యక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే ఎన్నికల్లో నేరచరిత్ర ఉన్న రాజకీయ నాయకులను గుర్తించి ప్రజల దష్టికి తీసుకెళ్లాలని పలువురు వక్తలు అన్నారు. అలాంటివారికి టికెట్లు ఇవ్వొద్దంటూ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ‘ఎన్నికలు- అభ్యర్థుల ఎంపిక’ అనే అంశంపై సోమవారం ఆ సంస్థ చైర్మెన్ పద్మనాభరెడ్డి అధ్యక్షతన చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకసత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీకి డబ్బు, కులం ప్రధాన అంశంగా మారిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం రూ.40 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే చెబితేనే కేసులు నమోదు చేయడంతోపాటు తొలగింపు, విచారణ జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. నేర వ్యవస్థను తొలగించాలంటే చట్ట బద్ధ పాలన జరగాలన్నారు. ఎన్నికల వ్యవస్థ మారాలని, నేరం చేసిన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని సూచించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురే స్వయంగా తన తండ్రి కబ్జాదారు అని చెప్పడం శుభ పరిణామమన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలకు ఎన్నికల్లో పోటిచేసే అర్హతలేదన్నారు. బాండ్ పేపర్‌పై ఎమ్మెల్యే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలను రాసి సభలలో ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు కాకుండా 40 నియోజకవర్గాలలో రూ.200 కోట్లకుపైగానే ఖర్చు చేస్తున్నారనీ, అయినా ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సీనియర్ సంపాదకులు దిలీప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు, రాజకీయాలు పూర్తిగా వ్యాపారమయమయ్యాయని వాపోయారు. ఎలక్షన్లు ఇన్వెస్ట్‌మెంట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, ప్రాఫిట్ మేకింగ్ మేనేజ్‌మెంట్‌గా మారాయని చెప్పారు. అవినీతికి పాల్పడినవారిక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వొద్దని పార్టీలకు సుప్రీంకోర్టు సూచించిందనీ, అయినా అది ఎక్కడా అమలుకావడంలేదన్నారు. మునుగోడు ఎన్నికలలో ఓటు వేయడానికి లైన్లో ఉన్న ప్రజలకు డబ్బులు పంచినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో నేరచరితులకు టికెట్లు ఇవ్వొద్దు
12:43 am