రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ఆటంకం కలిగించొద్దు

– హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌
– రాజ్యాంగం న్యాయ వ్యవస్థపై సెమినార్‌
– ఐలూ మహాసభలు విజయవంతం
నవతెలంగాణ-భువనగిరి
రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ఆటంకం కలిగించకుండా పరిపాలన కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌ ఉద్ఘాటించారు. ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆదివారం రెండవరోజు యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో కొనసాగాయి. ఈ సందర్భంగా ‘రాజ్యాంగం న్యాయవ్యవస్థ’ అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు రాజ్యాంగం మౌలికసూత్రాలకు లోబడి ఉండాలని విస్తృత ధర్మాసనం వెలువర్చిన తీర్పును, కేశవానంద భారతి కేసులో అంశాలను ప్రత్యేకంగా గుర్తించామన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి సమయంలో ఆనాటి ప్రభుత్వం పౌరులహక్కులను కాల రాసినప్పుడు.. న్యాయ వ్యవస్థ వ్యవహరించిన తీరు అభినందనీయమన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రభుత్వాలు తమ వ్యక్తిగత ఎజెండాల కోసం కాలరాసినప్పుడు ఆ హక్కులు కాపాడే బాధ్యతని పౌరులు తీసుకోవాలని కోరారు. పౌరుల హక్కులను రక్షించే విషయంలో న్యాయవాదులు చాలా ప్రముఖమైన పాత్ర వహించాలని కోరారు. ఐలూ లాంటి సంస్థలు ఇలాంటి వాటిల్లో ముందుంటాయని తెలిపారు. తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌ ఏ.నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఐలూతో సత్సంబంధాలను కలిగి ఉన్నారని, తన కార్యనిర్వహణలో ఐలు తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని వివరించారు. భవిష్యత్‌లో ఐలూ తీసుకునే కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు తెలిపారు. న్యాయవాద వృత్తిలో ఉన్న ప్రతి న్యాయవాది చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఐలూ ఆలిండియా కార్యదర్శి సురేంద్రనాథ్‌ పాల్గొనగా, మహాసభలకు అధ్యక్షవర్గంగా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్‌, నాయకులు అనంతల శంకరయ్య, శైలజ వ్యవహరించారు. కాగా, రెండు రోజులుగా నవ తెలంగాణ బుక్‌ హౌస్‌ ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శనలో ప్రతినిధులు పుస్తకాలు కొనుగోలు చేశారు. మహాసభలకు 400 మంది ప్రతినిధులు హాజరై సభను విజయవంతం చేశారు. మహాసభకు విజయవంతానికి సహకరించిన ప్రతిఒక్కరికి ఆహ్వాన సంఘం అధ్యక్షులు నాగారం అంజయ్య, ఐలూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మామిడి వెంకరెడ్డి, ఎండీ స్మైల్‌ అభినందనలు తెలిపారు. మహాసభలో ఆహ్వానసంఘం గౌరవ అధ్యక్షులు కొత్త బుచ్చిరెడ్డి, కార్యదర్శి ఎండీ. ఇస్మాయిల్‌, ఐలు జిల్లా అధ్యక్షులు మామిడి వెంకటరెడ్డి, నాయకులు నర్సింగ్‌యాదవ్‌, కేశవరెడ్డి, కుక్కదూగ సోమయ్య, బాబురావు, చింతల రాజశేఖర్‌ రెడ్డి, బొలెపెల్లి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
పలు అంశాలపై తీర్మానాలు
మహాసభల సందర్భంగా పలు అంశాలపై తీర్మానాలు చేశారు. న్యాయవిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని, మృతి చెందిన న్యాయవాదికి రూ.6లక్షలు చెల్లించాలని తీర్మానించారు. న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు ఉచితంగా లేదా కనీస ధరకు ఇవ్వాలన్నారు. న్యాయవాదులకు జీవితబీమా, ఆరోగ్య కార్డులు జారీ చేయాలని కోరారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పూర్తిస్థాయిలో కోర్టు భవనాలు నిర్మించి మౌలికవసతులు కల్పించాలని, న్యాయశాఖ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ న్యాయవాదులకు గవర్నమెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌, బ్యాంకు, జీవితబీమా కంపెనీల స్టాండింగ్‌ కౌన్సిల్‌ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని కోర్టులు ఆ చట్టాలకు అనుగుణంగా పనిచేసేలా రెగ్యులర్‌ న్యాయాధికారులను నియమించాలన్నారు. ఈ తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.